Venkateswarlu
Venkateswarlu
ఈ 21వ శతాబ్ధంలోనూ మంచితనం, మానవత్వం ఇంకా కొన ఊపిరితో బతికే ఉన్నాయని మరో సారి నిరూపితమైంది. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఓ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సంఘటనలో ఓ వృద్ధురాలి ధీన స్థితికి ఓ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ చలించిపోయాడు. మండు టెండలో చెప్పులు లేకుండా తిరుగుతున్న ఆమెను చూసి విలవిల్లాడాడు. ఆ వృద్ధురాలికి చెప్పులు కొనించటమే కాకుండా.. జ్యూస్ తాగించి మంచి మనసును చాటుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయనగరానికి చెందిన సురేస్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్‌గా టౌన్‌లోనే విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి శనివారం బస్టాండ్ దగ్గర డ్యూటీ పడింది. డ్యూటీలో ఉండగా.. ఓ వృద్ధురాలు ఒట్టి కాళ్లతో మండే రోడ్డుపై నడుస్తూ కనిపించింది. కాళ్లకు గాయాలై చాలా కష్టంగా ఆమె నడవటం గుర్తించాడు. దీంతో అతడి గుండె బాధతో విలవిల్లాడింది. ఆకలి కారణంగా సొమ్మ సిల్లి పడిపోవటానికి సిద్ధంగా ఉన్న ఆమెను చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లాడు. కొత్త చెప్పులు కొనించి, జ్యూస్ తాగించాడు. అంతేకాదు! ఆమె అడ్రస్ కనుక్కుని ఆటోలో ఇంటికి పంపించాడు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ట్రాఫిక్ పోలీస్ సురేష్.. ఈ కాలంలో కూడా మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నాడు’’..‘‘ అతడి మంచి మనసుకు కోటి దండాలు’’.. ‘‘ కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే వాళ్లకు ఆ దేవుడు కచ్చితంగా సాయం చేస్తాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, వృద్ధురాలి కష్టం చూసి చలించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్ మంచి మనసుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.