P Krishna
Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఓ సైకో ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఓ ఇనుప రాడ్డు పట్టుకొని వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ లో రికార్డు అయ్యాయి.
Vijayawada Railway Station: విజయవాడ రైల్వే స్టేషన్‌లో ఓ సైకో ప్రయాణికులను భయబ్రాంతులకు గురి చేశాడు. ఓ ఇనుప రాడ్డు పట్టుకొని వీరంగం సృష్టించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ లో రికార్డు అయ్యాయి.
P Krishna
నిత్యం ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. విధుల్లో ఉన్న లోకో పైలట్ ని ఓ సైకో ఇనుప రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టి హత్యచేశాడు. చికిత్స కోసం అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు. ఈ ఘటన రాత్రి రెండు గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనతో అక్కడి ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు ఒంటిపై చొక్కా లేకుండా సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. లోకో పైలట్ హత్య తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై రైల్వే లోకో పైలట్ అసోసియేషన్ ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడ రైల్వే స్టేషన్ లో ఘోరం జరిగింది. షంటింగ్ లోకో పైలట్ గా పని చేస్తున్న డి ఎబినేజర్ (52) విధుల్లో భాగంగా నైజాం గేటు సమీపంలోని ఏటీఎల్‌సీ ఆఫీస్ నుంచి ఎఫ్ – క్యాబిన్ వద్దకు వెళ్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని దుండగులు అతని వెనుక నుంచి వచ్చి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయాలపాలైన ఎబినేజర్ ఆపస్మారక స్థితిలో కిందపడిపోయాడు. అది గమనించిన మరో లోకో పైలట్ వెంటనే అక్కడికి వచ్చి సమీపంలో ఉన్నవారి సాయంతో రైల్వే హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే బాధితుడి పరిస్థితి విషమించింది.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అంతకు ముందు రైల్వే పరిసర ప్రాంతాల్లో పలువురిపై దాడి చేసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే గత కొంత కాలంగా కొంత కాలంగా రైల్వే స్టేషన్ పరిధిలో డ్రగ్స్, గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుందని.. కొంతమంది యువత వాటిని సేవించి సైకోలుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. రైల్వే స్టేషన్ లో లోకో పైలట్స్ పై రాళ్లు విసరడం, కర్రలతో దాడులు చేయడం లాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ సంఘటనతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా, నిందితుడు బిహార్ రాష్ట్రానికి చెందిన వాడని.. డబ్బు కోసం ఈ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్దారించారు పోలీసులు. నెల రోజుల క్రితం ఓ రైల్వే స్టేషన్ లో షాప్ యజమానిపై దాడి చేసి హత్య చేశాడని, అక్కడ నుంచి పారిపోయి ట్రైన్ ద్వారా విజయవాడకు చేరుకున్నట్లు గుర్తించారు. సీసీ టీవీ ఫులేజ్ ఆధారంగా లోకో పైలట్ ని హత్య చేసిన నేరంపై నిందితుడిని అరెస్ట్ చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో రైల్వే ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటి లోకో పైలట్ హత్య పై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమపై ఇలాంటి దాడులు జరిగాయని.. అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేదని ఈ సంఘటనతో రుజువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నానరు. నిందితులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.