Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం వంగవీటి రాధా నిశ్చితార్థం జరిగింది. నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్మన్ జక్కం అమ్మాని, బాబ్జీ దంపతుల రెండో కుమార్తె జక్కం పుష్పవల్లితో.. వంగవీటి రాధా ఎంగేజ్‌మెంట్ జరిగింది. సెప్టెంబర్ 3న అనగా ఆదివారం నాడు.. పెళ్లి కుమార్తె పుష్పవల్లి నివాసంలోనే.. ఎంతో ఘనంగా నిశ్చితార్థ వేడుక నిర్వహించారు. వాస్తవానికి.. ఆగస్టు 19నే వంగవీటి రాధ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల.. ఎంగేజ్‌మెంట్ వాయిదా పడింది.
దాంతో నిన్న అనగా.. సెప్టెంబర్ 3న రాధ-పుష్పవల్లిల నిశ్చితార్థం నిర్వహించారు. వంగవీటి రాధా నిశ్చితార్థ వేడుకకు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్థం వేడుకలో భాగంగానే.. పెళ్లి తేదీ కూడా నిర్ణయించారు.
ఈ క్రమంలో వచ్చే నెల అనగా అక్టోబర్ 22న వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి దంపతుల వివాహానికి ముహుర్తం నిశ్చియించారు. రాధా వివాహం చేసుకోబోయే యువతి పేరు పుష్పవల్లి. ఆమెది కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబమే. ఇక పుష్పవల్లి.. నర్సాపురం, హైదరాబాద్‌లలో చదువుకున్నారు. గతంలో కొన్ని రోజులు ఆమె యోగా టీచర్‌గా పని చేశారని సమాచారం.
వంగవీటి రాధా 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విజయవాడ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరిన ఆయన ఓటమిపాలయ్యారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన రాధా.. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నారు.