కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తారో తెలిసిందే. వెంకన్న కోసం ఎంతో వ్యయ, ప్రయాసలకు ఓర్చి సుదూరాలు ప్రయాణించి కొండ పైకి చేరుకుంటారు. కొన్ని గంటల పాటు లైన్లలో నిలబడి స్వామివారిని దర్శించుకుంటారు. శ్రీవారి దర్శన టికెట్లను కొందరు ముందే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే.. మరికొందరు నడక మార్గంలో ఇచ్చే టికెట్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటారు. ఇక, వీఐపీ దర్శనం గురించి తెలిసిందే. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులకు వీఐపీ దర్శనభాగ్యం ఉంటుంది. భక్తుల రద్దీతో పాటు పాపులారిటీ దృష్ట్యా సెలబ్రిటీలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో వీఐపీ దర్శనం ఏర్పాట్లు చేస్తారు.
అలాంటి వీఐపీ దర్శనభాగ్యాన్ని ఇప్పుడు సామాన్యులకు కూడా కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఈ విషయాన్ని బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సనాతన ధర్మ వ్యాప్తి జరగాలని, యువతలో భక్తి భావాన్ని పెంచాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు. రామకోటి మాదిరిగా గోవింద కోటి రాయించాలని తాము డిసైడ్ అయ్యామన్నారు భూమన. 25 ఏళ్ల లోపు వాళ్లు గోవింద కోటిని రాస్తే.. వాళ్ల కుటుంబానికి వీఐపీ దర్శనం కల్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎల్కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్స్‌కు అర్థమయ్యేలా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయాలని నిర్ణయించామని భూమన పేర్కొన్నారు.
ఇక, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ ఛైర్మన్ భూమన స్పందించారు. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఉదయనిధి చేసిన కామెంట్స్‌ను భూమన ఖండించారు. ‘సనాతన ధర్మం ఓ మతం కాదు. అదో జీవన విధానం. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి.. కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదు’ అని భూమన హితవు పలికారు. ఇక, సెప్టెంబర్ 18న జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవం, ధ్వజారోహణ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ వస్తారని, పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అదే రోజు టీటీడీ క్యాలండర్లు, డైరీలను కూడా ఆవిష్కరిస్తారని టీటీడీ ఛైర్మన్ వివరించారు.
ఇదీ చదవండి: ఉదయనిధి స్టాలిన్‌కు టీటీడీ ఛైర్మన్ స్ట్రాంగ్ కౌంటర్!