ఏపీ, తెలంగాణ విద్యార్థులకు టీటీడీ శుభవార్త!

సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడంలో భాగంగా విద్యార్థులకు భగవద్గీతలను పంపిణీ చేయనుంది. భగవద్గీతలను అర్థమయ్యే రీతిలో రాయించి పుస్తకాలుగా ముద్రించనుంది. వాటిని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోని కోటి మంది విద్యార్థులకు పంపిణీ చేయనుంది. దీనిపై టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా భగవద్గీతలను ముద్రించి ఆయా రాష్ట్రాల్లోని విద్యార్థులకు పంచే ఆలోచన చేస్తున్నామన్నారు.

హిందూ ధర్మ పెద్దలతో కలిసి హైందవ ధర్మ ప్రచారానికి కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. కళ్యాణమస్తు, శ్రీవారి కళ్యాణోత్సవాలను పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళతామన్నారు. గోవింద కోటి అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. 25 సంవత్సరాల లోపు వారు గోవింద కోటి రాస్తే.. వారి ఇంట్లో వారికి బ్రేక్‌ దర్శనం కల్పిస్తామన్నారు. చెన్నె, కాట్పాడి మార్గాల నుండి తిరుమలకు నడచి వచ్చే భక్తుల కోసం విడిది కేంద్రాలు నిర్మిస్తామన్నారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

భక్తుల్లో ఆత్మ విశ్వాసం పెంచడానికి చేతి కర్రలు ఇస్తున్నామన్నారు. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా.. భక్తులు మాత్రం సంతోషిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే తిరుమల నడక మార్గం వెంట కంచె నిర్మిస్తామన్నారు. మరి, టీటీడీ సనాతన హిందూ ధర్మ ప్రచారం కోసం తెలుగు రాష్ట్రాల్లోని కోటి మంది విద్యార్థులకు భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments