iDreamPost

ఏపీలో భారీగా తగ్గిన టమాటా ధరలు.. మరీ అంత తక్కువకా!..

ఏపీలో భారీగా తగ్గిన టమాటా ధరలు.. మరీ అంత తక్కువకా!..

గత జులై నెలలో ఎడ తెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా వ్యవసాయం ఇబ్బందుల పాలైంది. భారీగా పంట నష్టం కూడా జరిగింది. వర్షాల కారణంగా దేశ వ్యాప్తంగా చాలా పెద్ద మొత్తంలో టమాటా పంట నష్టం జరిగింది. దీంతో టమాటా ధరలు ఆకాశాన్ని చేరాయి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు కిలో టమాటా ధర రెండు వందల రూపాయలకు పైగా పలికింది. ఈ నేపథ్యంలో జనం టమాటా కొనడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొన్ని రోజుల ముందు వరకు సోషల్‌ మీడియాలో టమాటా ధరలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. మీమర్స్‌ టమాటా ధరలపై తమదైన శైలిలో హాస్యాన్ని పుట్టిస్తూ వచ్చారు. అయితే, కొన్ని రోజుల ముందు వరకు భారీ స్థాయిలో ఉన్న టమాటా ధరలు దిగి వచ్చాయి. ఆకాశం నుంచి ఏకంగా అధఃపాతాళానికి పడిపోయాయి. పది రోజుల క్రితం వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో దాదాపు 250 రూపాయలు పలికిన టమాటా ధర ఇప్పుడు కనిష్టంగా 30కి పడిపోయింది.

చిత్తూరులోని మదనదపల్లె మార్కెట్‌కు శుక్రవారం పెద్ద ఎత్తున టమాటా నిల్వలు వచ్చాయి. దాదాపు 400 టన్నుల టమాటా మార్కెట్‌కు చేరుకుంది. దీంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. మొదటి రకం టమాటా కిలో 30 రూపాయలనుంచి 40 రూపాయల ధర పలుకుతోంది. రెండో రకం టమాటా కిలో 21 నుంచి 28 రూపాయలు పలుకుతోంది. ఈ ధరలు మరికొన్ని రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, రంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టమాటా దిగుబడి బాగా పెరిగిందని సమాచారం. మరి, భారీగా తగ్గిన టమాటా ధరలపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి