iDreamPost

టమాటా రైతులకు కన్నీళ్లు.. మరీ దారుణంగా ధర!

టమాటా రైతులకు కన్నీళ్లు.. మరీ దారుణంగా ధర!

టమాటా రైతుల జీవితం జూదం లాగా మారిపోయింది. నెల రోజుల ముందు వరకు తారా స్థాయిలో లాభాలను పొందిన వారు ప్రస్తుతం విలవిల్లాడుతున్నారు. గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారు. నెల ముందు టమాటా ధర ఏకంగా 250 రూపాయలు పలికింది. దేశ ఈ మూల నుంచి ఆ మూల వరకు టమాటా రాజ్యం ఏలింది. పేద, మధ్య తరగతి ప్రజలు టమాటా వైపు కన్నెత్తిచూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి తారుమారైంది. టమాటా ధరలు దేశ వ్యాప్తంగా దారుణంగా పడిపోయాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో టమాటా 20-30 రూపాయలు పలుకుతోంది. కానీ, మార్కెట్‌లలో మాత్రం దారుణమైన ధరలు ఉంటున్నాయి. ఆ రేట్లతో టమాటా రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్లో కిలో టమాటా కేవలం 4 రూపాయలు మాత్రమే పలుకుతోంది. 100 కేజీల టమాటాకు కేవలం 200 రూపాయలు మాత్రమే వస్తుండటంతో రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. టమాటా నిల్వలు పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు చేరుతుండటం..

కొనడానికి కొనుగోలుదారులు ఎవరూ లేకపోవటం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. ఎరువులు, పురుగుల మందులు ఇతర ఖర్చులకు కూడా డబ్బులు రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు అంతా నాశనం చేస్తున్నాయని బాధపడుతున్నారు. మరి, టమాటా ధరలు భారీగా తగ్గటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి