ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం! లారీని ఢీ కొట్టిన కారు.. ఆరుగురు మృతి!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.  రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు  ప్రాణాలు కోల్పోతున్నారు.  మరెందరో తీవ్రగాయాలతో నరకవేదన అనుభవిస్తున్నారు. కొన్ని ప్రమాదాల్లో కుటుంబమంతా మృత్యు ఒడిలోకి చేరుతుంది. తాజాగా తిరుపతి జిల్లాలో   ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ఎన్టీఆర్ జిల్లా  విజయవాడకు చెందిన రమేశ్, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు, వీరికి ఇద్దరు కుమారులు  ఉన్నారు.   పెద్ద కుమారుడు ఇంజినీరింగ్ చదువుతున్నాడు.  రెండో కుమారుడు భరత్ వీరితో పాటు తిరుమల శ్రీవారిని దర్శనానికి వెళ్లారు. వారితో పాటు రాజ్యలక్ష్మి సోదరి శ్రీలతతో పాటు, వీరి స్నేహితుడు నరసింహమూర్తి కుటుంబం  కూడా తిరుపతికి వెళ్లింది. వీరందరూ శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని ఆదివారం శ్రీకాళహస్తీశ్వరుని దర్శనానంతరం విజయవాడకు వెళ్లాలని భావించారు.  ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి మారుతి ఎర్టిగా వాహనంలో శ్రీకాళ హస్తికి బయలు దేరారు.

ఈ క్రమంలో మిట్టకండ్రిగ అనే గ్రామం వద్ద మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని వీరి కారు ఢీ కొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీ కొనడంతో  రమేశ్(48), రాజ్యలక్ష్మి(40), శ్రీలత(42), నరసింహమూర్తి(47), వెంకట రమణ(38), అక్షయ(16) అక్కడికక్కడే మృతి చెందారు. కేవలం భరత్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. మృతుల్లో ఒకరైన శ్రీలతకు  ఇదివరకే భర్త మరణించారు.  స్థానికులు అందించిన సమచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను  పోస్టు మార్టం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి  తరలించారు.  మరోవైపు గాయపడిన భరత్ ను మెరుగైన చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show comments