Krishna Kowshik
Krishna Kowshik
గతంలో అయితే బడికి లేటుగా వెళ్లినా, హోం వర్క్ చేసుకుని రాకపోయినా.. ఉపాధ్యాయులు పనిష్మెంట్ కింద క్లాస్ బయట నించో పెట్టడం, మోకాళ్ల దండ వేయడం, వంగమనడం, గోడ కూర్చి వేయించడం చేసేవారు. ఇక అల్లరి చేస్తే బెత్తం పెట్టి కొట్టేవారు. ఇప్పుడంటే విద్య వ్యాపారంగా మారిపోయింది. అంతర్జాతీయ స్థాయిలో, ఆధునిక సాంకేతికతో విద్యా విధానం అంటూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రచారం చేయడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ బడుల్లో చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వ బడుల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. అక్కడ సదుపాయాలు తక్కువ కావడంతో ఆ పాఠశాలలకు పిల్లల్నిపంపేందుకు ఆసక్తి చూపడం లేదు తల్లిదండ్రులు. అయితే ఈ రోజుల్లో ఏ బడులకు పిల్లలను పంపినా, ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించలేని పరిస్థితి. చిన్న మాట అన్నా గొడవకు వచ్చేస్తున్నారు తల్లిదండ్రులు.
అయితే ఇప్పుడు ఓ ఉపాధ్యాయుడు ప్రవర్తించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా ఆలోచించే విధంగా ఉంది. పిల్లలను శిక్షించాల్సిన ఉపాధ్యాయుడు తనకు తానే శిక్ష వేసుకున్నాడు. ఇంతకు ఏమైందంటే.. చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలంలోని ఎస్ఆర్ కండ్రిగ జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరిస్తున్నారు మనోహర్ నాయుడు. విద్యార్థులు సకాలంలో పాఠశాలకు రాకపోవడంతో పాటు స్కూల్ యూనిఫాం ధరించకపోవడంతో.. తొలుత స్కూల్ మొత్తానికి పాఠశాల నిబంధనలను పాటించాలని సూచించారు. అయినప్పటికీ విద్యార్థుల్లో మార్పు రాలేదు. గురువారం కూడా విద్యార్థులు యథావిధిగా ఆలస్యంగా రావడం, యూనిఫాం ధరించకపోవడంతో తనకు తాను శిక్ష వేసుకున్నారు. పిల్లల్లో మేల్కొలుపు తెచ్చేందుకు మోకాళ్ల దండ వేశారు. క్రమ శిక్షణ తప్పితే శిక్ష విద్యార్థులకు ఇవ్వనని, తానే అనుభవిస్తానంటూ తెలిపారు. పిల్లలు తప్పు చేస్తే మార్కుల్లోనే, చేతల్లోనే చూపించే ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఇటువంటి ప్రధానోపాధ్యాయుడు ఉండటం చాలా అరుదు.