మన దేశంలో మహిళలపై వేధింపులు ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. అక్కడ, ఇక్కడ అనే తేడాల్లేకుండా తేడాల్లేకుండా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో స్త్రీలు, యువతులపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరిపోవడం లేదు. స్త్రీల మీద వేధింపులకు దిగిన వారిని పోలీసులు పట్టుకుంటున్నా, కోర్టులు శిక్షలు వేసి జైళ్లకు పంపుతున్నా పరిస్థితుల్లో ఊహించినంత మార్పు కనిపించడం లేదు. ప్రేమించకపోతే దాడికి దిగడం, కోరికలు తీర్చడం లేదంటూ వారిని లైంగికంగా వేధించడం లాంటి ఘటనల గురించి వార్తల్లో చూస్తున్నాం.
స్త్రీలపై దాడులకు దిగే వారిలో కొందరు విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. డబ్బు మదం చూసుకొని, రాజకీయంగా ఉన్న పలుకుబడిని వాడుకొని తమను ఎవరేం చేస్తారులే అనే ధీమాతో పేట్రేగిపోతున్నారు. ఇలాంటి వారికి రాజకీయ నేతలు, పార్టీలు అండగా నిలవడం సిగ్గుచేటనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్, అనంతపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి ప్రధాన అనుచరుడు, ఆ పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మార్కెట్ మహేష్ ఒక వివాహిత మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడటం చర్చనీయాంశంగా మారింది. వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప చెప్పిన ప్రకారం.. అనంతపురం వేణుగోపాల్‌నగర్‌కు చెందిన ఒక యువతి ఆరేళ్ల కింద లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ మహిళకు తన భర్త ద్వారా భవానీనగర్‌లో ఉంటున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మార్కెట్ మహేష్ ఏడాది కింద పరిచయం అయ్యాడు.
మహేష్ అప్పటి నుంచి ఛాన్స్ దొరికిన ప్రతిసారి లైంగికంగా ఆమెను వేధింపులకు గురిచేయసాగాడు. ఈ సంవత్సరం జులై 27న ఆ మహిళ తన భర్త ఫ్రెండ్స్ అంతా కలసి గోవా టూర్ ప్లాన్ చేశారు. అయితే తనకు వేరే పని ఉండటంతో భార్యను పంపాడు ఆమె భర్త. టూర్లో తనకు సోదరుడి వరుసైన ఓ వ్యక్తితో కలసి ఆ మహిళ తీసుకున్న ఫొటోలు, వీడియోలను ఎవరి ద్వారానో తెప్పించుకున్నాడు మహేష్. తన కోరిక గనుక తీర్చకపోతే వాటిని మహిళ భర్తతో పాటు అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. మహేష్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు. కాగా, ఈ కేసులో అతడ్ని రక్షించేందుకు బడా టీడీపీ నాయకులు రంగంలోకి దిగినట్లు సమాచారం.