తిరుమల తిరుపతిలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి మహిమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక శ్రీవారికి సంబంధించిన ఎన్నో విశేషాలు తిరుమల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంటాయి. అంతేకాక చిత్తూరు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో శ్రీనివాసుడి చరిత్రను తెలిపే ఆనవాలు ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా శ్రీవారికి సంబంధించిన ఓ అంశంపై అందరిలో చర్చ మొదలైంది. అంతేకాక చిత్తూరు జిల్లాలో శ్రీవారి పాద ముద్ర ఆనవాలు కనిపించాయి. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చిత్తూరు రూరల్ మండలంలోని తాళంబేడు పంచాయతీ టి.వేనపల్లె సమీపంలోని ఓ గుట్టకు ఉంది. ఆ గుట్టను అందరూ గోవిందరాజుల గుట్టా అని పిలుస్తుంటారు. రెండ్రోజుల క్రితం ఆ గుట్టలో శ్రీవారి పాద ముద్రిక దర్శనమిచ్చింది. చిత్తూరు-తచ్చూరు హైవే కాంట్రాక్టర్ మట్టి కోసం ఈ గుట్ట సమీపంలో తవ్వుతున్నాడు. ఇదే సమయంలో స్థానికులు కూడా ఆ మట్టి పనులను పరిశీలించేందుకు అక్కడకు వెళ్లారు. ఈక్రమంలో మట్టి తవ్వుతుండగా శ్రీవారి పాద ముద్ర కనిపించింది. దీంతో ఆ గుట్టలో శ్రీవారి పాదముద్ర ఉందంటూ స్థానికులు ఆ గుట్టకు నామాలు దిద్ది పూజలు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచి అమరనాథ్ రెడ్డి అక్కడి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి.. వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు.
అలానే ఆయన ఆధ్వర్యంలో తాళంబేడు, దిగుమాసాపల్లె, గువ్వకల్లు, చింతలగుంట, పెరుమాళ్ల కండ్రిగ, ఆనుగల్లు, ముత్తూకూరు, పాలూరు పంచాతీయల పెద్దలతో సమావేశం నిర్వహించారు. ముగ్గురు పెద్దలను సభ్యులుగా ఎన్నుకుని శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అయితే కొన్ని రోజుల క్రితం జరగ్గా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలోనే పాదం ఆనవాలు కనిపించడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఇది అంతా వెంకటేశ్వరస్వామి మహత్యం అంటున్నారు. అలాగే శ్రీవారి పాదముద్రకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరి.. ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.