ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. బాబు అరెస్ట్ న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగానూ పనిచేసిన నాయకుడు అరెస్ట్ అవడం చర్చనీయాంశంగా మారింది. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో టీడీపీ అధినేత ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే అదే సెంట్రల్ జైల్ సూపరిండెంట్ రాహుల్ ఇంట విషాదం నెలకొంది.
రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరిండెంట్ రాహుల్ సతీమణి కిరణ్మయి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా రాహుల్ భార్య చనిపోయారు. ఇక, జైలు సూపరిండెంట్ రాహుల్ సెలవు మీద వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. రాహుల్ సెలవుపై మీడియాలో అనేక రకాలుగా వార్తలు వచ్చాయి. దీనిపై కోస్తా జిల్లాల జైళ్ల శాఖ ఐజీ రవికిరణ్, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ తీవ్రంగా స్పందించారు. అధికారులు ఆయన్ను బలవంతంగా సెలవుపై పంపారనేది అవాస్తవమని తెలిపారు. రాహుల్ సెలవు పెట్టడాన్ని వక్రీకరించి రాయొద్దని కోరారు.
భార్య కిరణ్మయి చనిపోవడంతో రాహుల్ సెలవు పెట్టారని కోస్తా జిల్లాల డీఐజీ రవికిరణ్ చెప్పారు. ఏ విషయమైనా క్లారిఫికేషన్ తీసుకొని వార్తలు రాయాలని పేర్కొన్నారు. రాహుల్ భయపడి వెళ్లిపోయారని.. అధికారులు ఆయన్ను బలవంతంగా పంపారనేది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు రవికిరణ్. ‘మేం ఎప్పుడూ మా బాధ్యతలను విస్మరించలేదు. మా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. నా తల్లి కూడా మే నెలలో కన్నుమూశారు. మేమందరం మెంటల్ స్ట్రెస్‌లో ఉన్నాం. దయచేసి వాస్తవాలు రాయండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా అవాస్తవాలు ప్రచురించకండి’ అని డీఐజీ రవికిరణ్ మీడియాను కోరారు.
ఇదీ చదవండి: పవన్ BJPతో సంసారం చేస్తూనే TDPతో కలిశారు: మంత్రి జోగి రమేష్