iDreamPost
android-app
ios-app

సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం!

Punganur Calf: దేశంలోనే తొలిసారిగా సరోగసీ ద్వారా మేలు జాతి పుంగనూరు కోడెదూడ జన్మించింది. ఓ నాటు ఆవుకు పుంగనూరు జాత కోడె దూడ జన్మించింది. ఏడు రోజుల వయస్సున్న పుంగనూరు జాతి పిండాన్ని ఆ ఆవు గర్భంలో ప్రవేశ పెట్టారు.

Punganur Calf: దేశంలోనే తొలిసారిగా సరోగసీ ద్వారా మేలు జాతి పుంగనూరు కోడెదూడ జన్మించింది. ఓ నాటు ఆవుకు పుంగనూరు జాత కోడె దూడ జన్మించింది. ఏడు రోజుల వయస్సున్న పుంగనూరు జాతి పిండాన్ని ఆ ఆవు గర్భంలో ప్రవేశ పెట్టారు.

సరోగసీ ద్వారా పుంగనూరు కోడెదూడ జననం!

సరోగసీ.. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఇది. ఎందుకంటే.. చాలా మంది సెలబ్రిటీలు ఈ పద్ధతిలోనే తల్లిదండ్రులు అవుతున్నారు. పిల్లలు కావాలనుకునే జంటలోని స్త్రీ అండాన్ని, పురుషుడి స్పెర్మ్‌తో ఫలదీకరణం చెందిస్తారు. అనంతరం ఆ పిండాన్ని అద్దె గర్భంలో ఉంచుతారు. వైద్యుల పర్యవేక్షణలో సమయానికి ఆమె ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఇలా ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు బిడ్డలకు జన్మించారు. అయితే ఇలా  కేవలం మనషుల్లోనే ఈ పద్ధతిని వినియోగించడం చూశాం. కానీ దేశంలోనే తొలిసారి ఓ అద్భుతం జరిగింది. సరోగసీ ద్వారా పుంగనూరు కోడె దూడ జన్మించింది. మరి… ఆ వివరాలు ఏమిటో.. ఇప్పుడు చూద్దాం..

దేశంలోనే అరుదైన ఘనతకు ఆంధ్రప్రదేశ్ వేదికైంది. తొలిసారిగా సరోగసి(అద్దె గర్భం) ద్వారా మేలు జాతి పుంగనూరు కోడెదూడ జన్మించింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని శెట్టిగుంట అనే గ్రామంలో ఈ అరుదైన ఘటన జరిగింది. అక్కడ ఓ మాములు ఆవుకు పశు వైద్యులు ప్రసవం చేశారు. ఆ నాటు ఆవు పుంగనూరు జాత కోడె దూడ జన్మించింది. రాష్ట్రీయ గోకుల్ మిషన్ వారి ఆధ్వర్యంలో చింతలదీవి పశుక్షేత్రంలో అభివృద్ధి చేసిన ఏడు రోజుల వయస్సున్న పుంగనూరు జాతి పిండాన్ని శెట్టిగుంట గ్రామంలోని ఓ నాటు ఆవు గర్భంలో ప్రవేశ పెట్టారు.

శెట్టిగుంట గ్రామానికి చెందిన హరి అనే రైతుకు చెందిన ఆవు గర్భంలో ఈ పిండాన్ని ఉంచారు. ఈ ఏడాది మార్చి 4వ తేదీన ప్రవేశపెట్టగా.. మే 25వ తేదీన ఆవు గర్భం ఓకే అయినట్లు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ఆరీఫ్‌ నిర్థారించారు. చూలు సమయంలో ఆ ఆవు ఆరోగ్య పరిరక్షణ కోసం దాణా, మంచి పోషకాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఫ్రీగా అందించారు. ఇలా దాదాపు చాలా నెలలు పాటు ఆ ఆవును ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. నెలలు నిండిన ఆవు ఆదివారం రాత్రి పుంగనూరు జాతి దూడకు జన్మనిచ్చిందని దీనిని పర్యవేక్షించిన వైద్యులు ప్రతాప్ తెలిపారు.

జన్మించిన కోడదూడ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్‌ అండ్‌ ఎంబ్రియో ట్రాన్సఫర్‌ విధానం ద్వారా పుంగనూరు కోడెదూడ జన్మించడం దేశంలోనే మొట్ట మొదటిదని డాక్టర్‌ ప్రతాప్‌ అన్నారు. ఈ పిండమార్పిడి విధానానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల ఖర్చు అవుతోందని ఆయన తెలిపారు. ఈ విధానం ద్వారా  మనకు కావాల్సిన పశువుల సంతతి వృద్ధి చేసుకోవచ్చని ఆయన వివరించారు. గతేడాది ఇదే విధానంలో ఒంగోలు ఆవుకు సాహివాల్‌ దూడ జన్మించింది. మరి.. దేశంలోనే ఇలా జరిగిన అరుదైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.