iDreamPost
android-app
ios-app

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ప్రకాశం బ్యారేజ్‌!

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ప్రకాశం బ్యారేజ్‌!

ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తుకు వచ్చే వాటిల్లో విజయవాడ వద్ద కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారేజ్.  ఈ ప్రాజెక్ట్ కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాలకు తాగు, సాగు నీరు లభిస్తోంది. విజయవాడ వెళ్లిన ప్రతి ఒక్కరు ప్రకాశం బ్యారెజ్ ను సందర్శించకుండా మానరు. అలాంటి ప్రసిద్ధమైన ఈ బ్యారెజ్ కి ఇప్పటికే ఎన్నో గుర్తింపులు లభించాయి. తాజాగా ప్రకాశం బ్యారేజ్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ సీఎస్ శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్‌ అవంతివర్మ లేఖ రాశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని  కృష్ణా నదిపై నిర్మించిన ప్రకాశం బ్యారెజ్ రాష్ట్రానికే తలమానికం. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు పేరును ఈప్రాజెక్టుకు పెట్టారు. దీని పొడవు 1.2 కిలోమీటర్లు ఉంది. 1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు 4 ఏళ్లకు పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా  ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది. ఏపీ అని చెప్పగానే ఠక్కున గుర్తుకు వచ్చే వాటిల్లో ఈ ప్రకాశం బ్యారెజ్ ఒకటి.

ఇప్పటికే అనేక గుర్తింపులు పొందిన ఈ బ్యారెజ్ తాజాగా మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఐసీఐడీ ఎంపిక చేసింది. దేశం నుంచి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిశాలోని బలిద్హిహా ప్రాజెక్టు, జయమంగళ ఆనకట్టలు,తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈ అవార్డుకు ఎంపికైనట్టు ఐసీఐడీ ప్రతినిధులు తెలిపారు.వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే హెరిటేజ్ స్ట్రక్చర్లను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసీఐడీ ఈ అవార్డులను ఏర్పాటు చేసింది.

ఈ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్ అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2-8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసీఐడీ కాంగ్రెస్, 74వ ఐఈసీ సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు అందజేయనున్నారు. 1950, జూన్‌ 24న ఏర్పడిన ఐసీఐడీ… పురాతన కాలంలో నిర్మించి.. నేటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. ప్రకాశం బ్యారేజీకి అరుదైన గుర్తింపు లభించడంపై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ప్రకాశం బ్యారేజ్ కి అరుదైన గుర్తింపు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.