Dharani
Dharani
మాజీ ముఖమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మీద అన్నమయ్య జిల్లాలో కేసు నమోదయ్యింది. ప్రాజెక్ట్‌ల సందర్శన పేరుతో చంద్రబాబు నాయుడు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లాలో సంచరిస్తూ.. టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యాఖ్యల నేపథ్యంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడమే కాక.. అడ్డుకున్న పోలీసులపై కూడా విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు. ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో పుంగనూరు ఘటనపై విచారణ చేపట్టాలని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో దాడులకు సంబంధించి 30 మంది టీడీపీ నేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు నమోదు చేశారు.
అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ముదివేడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు నాయుడి మీద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో అంగల్లులో టిడిపి కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రసంగం చేశారనే ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదైంది. మరో ఇద్దరు మాజీ మంత్రుల మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ఏ1గా చేర్చగా.. మాజీ మంత్రి దేవినేని ఉమాను ఏ2గా, మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డిని ఏ3గా చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో మొత్తం 20మంది పేర్లను చేర్చారు. అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు రెచ్చగొట్టారని అభియోగాలు నమోదు చేశారు.