iDreamPost
android-app
ios-app

పోలీసులను బెదిరించిన పరిటాల సునీత! ఉరి వేసుకుంటా అంటూ!

పోలీసులను బెదిరించిన పరిటాల సునీత! ఉరి వేసుకుంటా అంటూ!

స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. నంద్యాలలో ఈ నెల 9న ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరచగా.. ఆయనకు తొలుత 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత మరో రెండు రోజుల పాటు రిమాండ్‌ను పొడిగించింది. ఆ సమయంలోనే రెండు రోజుల విచారణ నిమిత్తం సీఐడీ కస్టడీకి అప్పగించింది. శని, ఆదివారాల్లో ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అలాగే ఆదివారంతో గడువు ముగియడంతో మరో 11 రోజుల పాటు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబర్ 5 వరకు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండనున్నారు. అయితే గత విచారణలో చంద్రబాబు తమకు సహకరించలేదని, మరో ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు అరెస్టు విషయంలో టీడీపీ శ్రేణులు కాస్త హడావుడి చేస్తున్నాయి. ఆయన అరెస్టు అక్రమమంటూ నిరసనలు చేపడుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మంత్రి పరిటాల సునీత రెండు రోజులుగా అనంతపురం గ్రామీణ మండలం పాపం పేటలో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆమెతో కలిసి కొంత మంది మహిళలు నిరసనల్లో పాల్గొన్నారు. సోమవారం అర్థరాత్రి సునీతకు వైద్యులు పరీక్షించగా.. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని గుర్తించారు. దీంతో మంగళవారం ఉదయం పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. తొలుత పరిటాల సునీతను నిరసన విరమింపజేసుకోవాలని అభ్యర్థించారు. ఆమె ససేమీరా అనడంతో పరిటాల సునీతనుద్దేశించి.. అక్కను తీసుకెళ్లండని మహిళా పోలీసులకు సూచనలు చేశారు.

అయితే మమ్మల్ని తీసుకెళితే ఉరి వేసుకుంటామని బెదిరించారు పరిటాల సునీత. మెడలో ఉన్న కండువా తీసుకుని పీకకు ఉరి వేసుకోబోతుంటే.. పోలీసులు అడ్డుకున్నారు. తమను ముట్టుకుంటే.. ఊరుకునేది లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పలుమార్లు ఉరి వేసుకుంటామని చెప్పి కండువాను మెడకు చుట్టుకుని పోలీసులను బెదిరించడం మొదలు పెట్టారు. మీరు నిరసంగా ఉన్నారని, మీరు నిరసన ఆపేయాలని కోరినా వినిపించుకోలేదు. తన ఆరోగ్యానికి ఏం కాలేదని చెప్పుకొచ్చారు. అయితే వైద్యుల సలహా మేరకు ఆమెను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.