Venkateswarlu
Venkateswarlu
మొన్నటి వరకు టమాటా జనాన్ని భయపెట్టింది. కిలో టమాటా దాదాపు 250 రూపాయలు పలికింది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారైంది. కిలో టమాటా 20 రూపాయలు మాత్రమే ఉంది. దానికి తోడు టమాటా మార్కెట్లలో రైతులకు షాక్ తగులుతోంది. కిలో కేవలం 10 రూపాయల కంటే తక్కువ పలుకుతోంది. దీంతో రైతులు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సమయంలో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. మొన్నటి వరకు 20-30 రూపాయలు పలికిన ఉల్లి.. జనాలకు కన్నీళ్లు పెట్టించే దిశగా అడుగులు వేస్తోంది.
దాదాపు 5 రోజుల్లో ఏకంగా 10 రూపాయలు పెరిగింది. ఇప్పుడు కిలో ఉల్లిపాయల ధర దాదాపు 40 రూపాయలుగా ఉంది. మార్చి రేట్లతో పోల్చుకుంటే ఉల్లి ధర 150 శాతానికిపైగా పెరిగింది. మార్కెట్‌లో ఉల్లి కొరత కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ఈ సంవత్సరం కర్నూలు, అనంతపురం, కడపజిల్లాల్లో కూడా ఉల్లి సాగు బాగా తగ్గింది. తాడేపల్లి గూడెం మార్కెట్‌కు ప్రతీ రోజు 80 నుంచి 90 లారీలు వచ్చేవి. ఇప్పుడు ఒకటి రెండు లారీలు మాత్రమే వస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉల్లిపాయల రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
కిలో ఉల్లిపాయల ధర 60 నుంచి 70 రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం రైతు బజార్లలో కిలో ఉల్లి ధర 30 రూపాయలుగా ఉండగా.. మిగిలిన ప్రాంతాల్లో 40 రూపాయలు పలుకుతోంది. నాఫెడ్ ఉల్లితో పోలిస్తే.. మార్కెట్లోకి వచ్చే ఉల్లి నాణ్యత బాగుండటంతో ధరలు ఎక్కువగా ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మరి, ఉల్లి ధరలు పెరుగుతూ సాధారణ జనాలకు షాక్ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.