నిత్యావసర వస్తువుల ధరలు అందర్నీ భయపెడుతున్నాయి. కూరగాయల్లో అధికంగా వాడే టమాట ధరలు ఆల్రెడీ కొండెక్కి కూర్చున్నాయి. కిలో టమాట ధర ఇప్పటికే డబుల్ సెంచరీ దాటిపోయింది. వీటిని కొనాలంటేనే సామాన్యులు జంకుతున్నారు. ఇటీవల కురిసన భారీ వర్షాలతో జరిగిన పంట నష్టం, మార్కెట్లలో తగినంత సరఫరా లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిలో సమస్యలు తలెత్తడంతో కూరగాయల రేట్లు రోజురోజుకీ మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే టమాటాలు కొనడానికి భయపడుతుంటే మరో కూరగాయ కూడా అదే బాటలో పయనిస్తోంది.
టమాట తర్వాత కూరగాయల్లో అధికంగా వాడేవి ఉల్లిపాయలే. అలాంటి ఉల్లి కూడా టమాటల బాటలో ప్రయాణిస్తూ రేటు విషయంలో పరిగెత్తుతోంది. మూడేళ్ల కింద ఉల్లి రేటు బాగా పెరిగి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంవత్సరం కూడా మరోమారు ఉల్లిపాయల ధరలు బాగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. విపరీతంగా కురిసిన వానల వల్ల ఉల్లిపాయల సరఫరాలో అంతరాయంతో పాటు కొరత ఏర్పడింది. దీంతో వాటి రేట్స్ బాగా పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. ఉల్లిపాయల ధరలు ఈ నెలాఖరు వరకు పెరుగుతూ.. సెప్టెంబర్ దాకా కిలో రూ.60 నుంచి రూ.70 దాకా పెరగొచ్చని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్’ తెలిపింది.
2020లో ఉన్న గరిష్ట ధరల కంటే ఈసారి ఉల్లిపాయల ధరలు కాస్త తక్కువే ఉండొచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పేర్కొంది. రబీలోని ఉల్లి నిల్వలు ఆగస్టు చివరి వరకు సరిపోతాయని తెలిపింది. సెప్టెంబర్ నెల వరకు ఉల్లిపాయల సరఫరా తగ్గుముఖం పట్టొచ్చని.. అప్పుడు వాటి ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత మాత్రం ధరలు పెరిగే అవకాశం లేదని.. అక్టోబర్ నుంచి ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది. అక్టోబర్ నెలలో ఖరీఫ్ పంట చేతికొస్తే ఉల్లి ధరల్లో పెరుగుదల ఉండదని ఓ రిపోర్టులో క్రిసిల్ వివరించింది.