చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరుతో వివిధ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో శుక్రవారం చిత్తూరు జిల్లా అంగళ్లు కూడలి నుంచి పుంగనూరు బయల్దేరిన చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అలానే చంద్రబాబు పర్యటనలో టీడీపీ శ్రేణులు రెచ్చిపోయారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేశారు. దాడుల్లో పలువురు వైసీపీ శ్రేణులకు, పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పుంగనూరు పర్యటనలో చంద్రబాబు నాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పుంగనూరు పర్యటలో ఉన్న చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నన్ను అడ్డుకుంటే ఇలాగే జరుగుతుంది. దెబ్బలు తగిలినా.. తలలు పగిలినా.. భయపడేదే లేదు. మీరు అడ్డున్నా నేను వస్తాను. కేశప్ప.. డీఎస్పీకి అప్పిలు చేస్తున్నాను. రోష ముండాలి.. రోషం లేని జీవితం నాశనం. పోలీసులు వైసీపీ వారిని ఒక్కరిని అదుపు చేయలేదు. పోలీసులు కూడా మనల్నే కొట్టారు. ప్రజలు తిరుగు బాటు చేస్తే ఎలా ఉంటుందో చూశారుగా. మీరు కర్రలతో వస్తే.. నేను కర్రలతోనే వస్తా. ఒళ్లు దగ్గర పెట్టుకోండి. పిచ్చి పిచ్చి వేశాలు వేస్తే తాట తీస్తాను. పిల్లి కూడా రూమ్ లో పెడితే పులి అవుతుంది. మీరు యుద్ధం చేస్తే నేను యుద్ధం చేస్తాను. పుంగనూరులో అదే జరిగింది. ఒక కర్ర, ఒక రాయి తెస్తే నేను భయపడతానా?. మీరు మగాళ్లైతే పోలీసులు లేకుండా రండీ.. తేల్చుకుందాం. పెద్దిరెడ్డి.. నీ పతనం అయ్యేవరకు నిద్రపోను” అంటూ చంద్రబాబు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంగళ్ల కూడలి యుద్ధభూమిని తలపిస్తుంది.