P Krishna
P Krishna
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయాల్లో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఏపిలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. దీంతో గెలుపు కోసం ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్ష పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ సమయంలో చంద్రబాబు అరెస్ట్ కావడం టీడీపీలో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఇటీవల చంద్రబాబుని కలిసి వచ్చిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పొత్తు పై టీడీపీ, జనసేన కేడర్లలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మిణి జనసేన నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు కోడలు.. నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మిణి ఆదివారం నాడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో లోకేష్ క్యాంపు కార్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నారా బ్రహ్మిణి.. జనసేన నేతలు చూస్తూ పవన్ కళ్యాణ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారే అవాక్కైన జనసేన నేతలు ఇలాంటి సమావేశాలకు కూడా తమ అధినేత హాజరవుతారా? అంటూ తమలో తామే ప్రశ్నించుకొని ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక.. తమ అధినేత ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
రాబోయే ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, జనసేన కలిసి చేసే ఉమ్మడి పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తేనే ముందుకు సాగుతామని ఆ పార్టీ నేతలు నారా బ్రహ్మణికి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఇందుకోసం నిధులను సమకూర్చాలని జనసేన నేతలు ఆమెను కోరినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సమాధానంగా ఆమె నిధుల విషయం తర్వాత మాట్లాడుకుందాం.. ముందు ఉమ్మడి పోరాటం ప్రారంభిద్దాం అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జనసేన నేత నాగబాబు చిత్తూరు పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కానీ టీడీపీతో కలిసి ప్రయాణం చేయడం తప్పదంటూ కార్యకర్తలకు నాగాబాబు సూచింనినట్లు వార్తలు వస్తున్నాయి.