P Krishna
P Krishna
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటారు. వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతారు జంట. నిండు నూరేళ్లు కలిసి ఉండాలని పెద్దలు దీవిస్తుంటారు. సాధారణంగా ఆడపిల్లపై తండ్రికి ఉండే ప్రేమ ఎంతో గొప్పగా ఉంటుందని అంటారు. నిరు పేద అయినా.. కోటీశ్వరుడైనా తమ ఆడపిల్లను మహరాణిగా చూసుకుంటారు. ఇక పెళ్లి విషయంలో తమ స్థాయికి మించి ఖర్చు చేసి అత్తారింటికి పంపుతుంటారు. ఓ తండ్రి తన కూతురుకి వివాహం చేసి అత్తారింటికి ఏకంగా హెలికాప్టపర్ లో సాగనంపారు. దీనికి సంబంధిచిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
సాధారణంగా తల్లిదండ్రులు తమ స్థోమతను బట్టి కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తుంటారు. ఇక అత్తారింటికి కారు ఇతర వాహనాల్లో సాగనంపుతుంటారు. అలాంటిది ఏపీలో నెల్లూరు పట్టణ అభివృద్ది సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తన కూతురు ఉషశ్రీ వివాహం హైదరాబాద్ కి చెందిన ప్రశాంత్ తో అంగరంగ వైభవంగా జరిపించారు. వివాహం అనంతరం అత్తారింటికి సాగనంపే సమయం వచ్చింది. తన కూతురుని అందరూ పంపించిన వాహనాల్లో కాకుండా హెలికాప్టర్ లో పంపించాలని భావించాడు.
తన కూతురుని అత్తారింటికి పంపించేందుకు ఓ హెలికాప్టర్ ని అద్దెకు తీసుకున్నారు ద్వారకానాథ్. నెల్లూరు నుంచి విజయవాడకు కూతురుని హెలికాప్టర్ లో పంపించారు. ఇక హెలికాప్టర్ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేయించారు. అత్తారింటికి నవదంపతులను హెలికాప్టర్ లో పంపించడంపై స్థానికులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ప్రసుతం ద్వారకానాథ్ ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
తన కూతురుని అత్తారింటికి హెలికాప్టర్ లో పంపించడంపై ద్వారాకానాథ్ మాట్లాడుతూ.. అందరూ ఉషశ్రీ నా కూతురు అని అనుకుంటారు.. కానీ తను మా అన్న కూతురు. మాది ఉమ్మడి కుటుంబం. చిన్నప్పటి నుంచి ఉష నేను అత్తారింటికి వెళ్తే హెలికాప్టర్ లో వెళ్తాను అంటూ ఉండేంది. అప్పుడు తన మాటలు ఫన్నీగా తీసుకున్నా.. తన కల నెరవేర్చాలన్న ఆలోచన మాకు వచ్చింది. అందుకే హెలికాప్టర్ ని అద్దెకు తీసుకొని అత్తారింటికి సాగనంపాం. అలా మా బిడ్డపై మాకున్న ప్రేమను చాటుకున్నాం అన్నారు.