భర్త వదిలేసినా.. బిడ్డల కోసం తల్లి పోరాటం! ఇదీ విజయం అంటే!

Mother of Great Daughters: ముగ్గురు ఆడపిల్లలు అంటూ భర్త విడిచి వెళ్లాడు.. కానీ మొక్కవోని ధైర్యంతో తన కూతుళ్లను ఉన్నతవిద్యావంతులుగా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ తల్లి.

Mother of Great Daughters: ముగ్గురు ఆడపిల్లలు అంటూ భర్త విడిచి వెళ్లాడు.. కానీ మొక్కవోని ధైర్యంతో తన కూతుళ్లను ఉన్నతవిద్యావంతులుగా తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచింది ఓ తల్లి.

ఈ కాలంలో మహిళలు విద్య, వైద్య, సాంకేతిక, రాజకీయ రంగాల్లో మగవారికి ధీటుగా తమ సత్తా చాటుకుంటున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆడవారంటే చిన్న చూపే ఉంది.  కొన్ని కుటుంబాలు అమ్మాయిలు పుడితే భారంగా భావిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టారని కట్టుకున్న భార్యను చిత్ర హింసలకు గురిచేసే దుర్మార్గపు భర్తలు, అత్తమామలు ఉన్నారు. మరికొందరు పురిటిలోనే హతమార్చే రాక్షసులు ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనే కారణంతో భార్యను వదిలి వెళ్లిపోయాడు ఓ భర్త. కానీ ఆ తల్లి కుంగిపోకుండా.. ముగ్గురు ఆడపిల్లలను సమాజంలో గౌరవమైన స్థానంలో నిలబెట్టి అందరిచే షభాష్ అనిపించుకుంది.. వివరాల్లోకి వెళితే..

శృంగవరపు కోటలో శ్రీనివాస కాలనీకి చెందిన మాచిట్లి బంగారమ్మ తన ముగ్గురు ఆడపిల్లలతో జీవిస్తుంది. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారని.. వాళ్లను సాకడం తన వల్ల కాదని బంగారమ్మ భర్త  విడిచి వెళ్లారు. దీంతో కుటుంబాన్ని ఆమే పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముగ్గురు ఆడపిల్లలను కష్టపెట్టకుండా.. కంటికి రెప్పలా సాకుతూ.. సమాజంలో తన కూతుళ్లను గొప్ప స్థానంలో నిలబెట్టాలని నిర్ణయించుకుంది. దినసరి కూలీగా పని చేస్తూ వచ్చే డబ్బుతో తన కూతుళ్లకు చదువులు చెప్పించింది. సమాజంలో చదువు విలువ ఎంత గొప్పదో తన కూతుళ్లకు చెబుతూ వచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివిన రెండవ కూతరు రేవతి ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆపేయాలని భావించినా.. టెన్త్ లో ఆమె ప్రతిభ చూసి స్థానిక పుణ్యగిరి విద్యాసంస్థల అధినేత ఎల్ సత్యనారాయణ తన కాలేజ్ లో ఉచితంగా ఇంటర్మీడియెట్ లో ప్రవేశం కల్పించారు. అంతేకాదు రేవతి ఎంత వరకు చుదువుతుందో అంత వరకు తనదే బాధ్యత అని హామీ ఇచ్చారు.

ఈ క్రమంలోనే రేవతి ఇంటర్ లో 984 మార్కులు సాధించి.. ఎంసెట్ లో మంచి ర్యాంక్ తో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. 2019 లో జగన్ మోహన్ రెడ్డి భర్తీ చేసిన సచివాలయ ఉద్యోగాల్లో ధర్మవరం సచివాలయం లో అసిస్టెంట్ ఇజనీర్ పోస్ట్ దక్కించుకుంది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షలు రాసి అందులోనూ ఉత్తీర్ణత సాధించి ప్రస్తుతం జోన్ – 1 పరిధిలో శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో ఆర్ డబ్ల్యూ ఎస్ ఏఈఈగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవతి అక్క సరస్వతి సైతం మంచి విద్యావంతురాలే.. ప్రస్తుతం ఆమె ఏలూరు లో సచివాలయం ఉద్యోగినిగా పనిచేస్తుంది. ఇక చిన్నమ్మాయి పావని పీహెచ్‌డీ చేస్తుంది. భర్త విడిచి వెళ్లిపోయినా.. తన కూతుళ్లు చదువులో రాణించి గొప్ప స్థాయికి వచ్చినందుకు బంగారమ్మ ఆనందానికి అవధులు లేవు. బంగారమ్మను, ఆమె కూతుళ్లను స్థానికులు మెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments