iDreamPost
android-app
ios-app

MLC కుంభా రవిబాబు చొరవతో.. Phd భారతికి SVUలో ఉద్యోగం!

MLC కుంభా రవిబాబు చొరవతో.. Phd భారతికి SVUలో ఉద్యోగం!

సాకే భారతి.. గత కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న పేరు ఇది. ఈమె సాధించిన విజయం ఎంతో మందికి స్ఫూర్తి. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, జీవితంలో ఏదైనా సాధించాలని ఎదురుచూస్తున్న ఆడపిల్లలు ఈమొక దిక్సూచి. ఒకరోజు కూలికి వెళ్తూ ఒకరోజు కాలేజ్ కు వెళ్తూ కష్టపడి చదివి చివరకు తాను అనుకున్న పీహెచ్డీ సాధించింది. అది కూడా అంత తేలికైన సబ్జెక్ట్ కాదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. ప్రస్తుతం అందరూ ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఆమెకు ఏదైనా సహాయం చేయాలంటూ కొందరు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఆ విషయంలో ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ముందుకొచ్చారు.

సాకే భారతి కథ విన్న తర్వాత అందరూ ఆమెకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. అయితే ఆ తర్వాత అందరూ అంటున్న మాట మాత్రం ఆమెకు ఏదైనా సహాయం చేయండి. చాలా మంది ఆమెకు ఆర్థికంగా సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. కానీ, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అలా చేయాలి అనుకోలేదు. అలా చేస్తే ఆమె ఎప్పటికీ సహాయం కోసం ఎదురుచూసే స్థితిలోనే ఉంటుందని భావించారు. అందరిలా కాకుండా ఆమెకు తన కాళ్ల మీద తాను నిలబడగలిగే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి అనుకున్నారు. అందుకోసం ఆయన చకాచకా ఏర్పాట్లు కూడా చేశారు. ఆ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్సీ రవిబాబు ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

“సాకే భారతి ఈ స్థాయికి రావడం చాలా సంతోషం. ఒక నిరుపేద కుటుంబం వచ్చిన భారతి ఎంతో పట్టుదలతో డిగ్రీ చదివి, ఆ తర్వాత పీజీ చేసి ఇప్పుడు పీహెచ్డీ పూర్తి చేయడం సామాన్యమైన విషయం కాదు. ఆమెను చిన్నతనం నుంచి ప్రోత్సహించిన అధ్యాపకులను ధన్యవాదాలు. ఆమెకు పీహెచ్డీ రావడానికి ప్రోత్సహించిన ప్రొషెసర్ శోభా గారికి ధన్యవాదాలు. భారతి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. భారతితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాను. ఆ తర్వతా నాకు ఒక విషయం అర్థమైంది. తాత్కాలికంగా పనికొచ్చే ఆర్థిక సాయాలు సరికాదని భావించాను. ఒక గంట తర్వాత తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ వీసీకి కాల్ చేసి.. 20 నిమిషాలు మాట్లాడాను. ఇలాంటి వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వాలి సార్ అంటూ కోరాను. ఆయన చాలా పాజిటివ్ గా స్పందించారు. కచ్చితంగా హెల్ప్ చేద్దాం.. ఏం చేద్దామో చెప్పండి అన్నారు.

ఆమెకు ప్రస్తుతానికి ఆర్థికంగా సహాయం కావాలి. కాబట్టి ఆమెను ఫ్యాకల్టీగా తీసుకోండి అన్నాను.  అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని మీరు నోటిఫికేషన్ లేకుండా ఇవ్వలేరని తెలుసు. కాబట్టి మీరు టీచింగ్ అసిస్టెంట్ పోస్టు ఇవ్వగలరు. అది మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పాను. ఆయన భారతి గారిని వెంటనే పంపించమని చెప్పారు. అదే యూనివర్సిటీలో వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసే శ్యామ్ గారితో కూడా మాట్లాడను. భారతికి ఏమీ తెలియదు.. ఆమెను వీసీ గారి దగ్గరకు తీసుకెళ్లండి అని చెప్పాను. ఆయన కూడా పాజిటివ్ గా స్పందించారు.” అంటూ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు చెప్పుకొచ్చారు. భారతి ఏకైక కల ఆమెకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలి. ఆ లక్ష్య సాధనలో తొలి అడుగు వేసేందుకు వైసీపీ ఎమ్మెల్సీ రవిబాబు తన వంతు కృషి చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ రవిబాబుపై పార్టీ వర్గాలు మాత్రమే కాకుండా.. నెటిజన్స్ కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భారతి తన కాళ్ల మీద తాను నిలబడేలా చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.