iDreamPost
android-app
ios-app

శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు.. మంత్రి అంబటి సీరియస్!

శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు.. మంత్రి అంబటి సీరియస్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అంబటి రాంబాబు తిరుమల పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఉదయం అంబటి రాంబాబు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా కొన్ని రోజులుగా శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న ఆరోపణలపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గొప్ప ఆశయంతో పని చేస్తున్న ట్రస్టుపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. శ్రీవాణి ట్రస్టు రావడం వల్లే దళారీ వ్యవస్థ తగ్గిందని స్పష్టం చేశారు.

మంత్రి అంబటి రాంబాబు ట్రస్టు గురించి మాట్లాడుతూ.. “శ్రీవాణి ట్రస్టుపై కొందరు అనవసరపు, అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టీటీడీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్టును ఒక గొప్ప ఆశయంతో ప్రారంభించారు. ఈ ట్రస్టు వచ్చిన తర్వాతే ఇక్కడ దళారీ వ్యవస్థ తగ్గింది. ఈ ట్రస్టు ద్వారా వచ్చే నిధులను శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునరుద్ధరణ, కొత్త ఆలయాల నిర్మాం, ధూపదీప నైవైద్యేల కోసం వినియోగిస్తున్నారు. అలాంటి ట్రస్టు గురించి ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయడం తగదు. ఇకనైనా శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేసే వారికి బుద్ధి రావాలి” అంటూ అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు.

ఇప్పటికే శ్రీవాణి ట్రస్టుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈవో ధర్మారెడ్డి కూడా వివరణ ఇచ్చారు. కొందరు పనిగట్టుకు చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. శ్రీవాణి ట్రస్టుకు ఇప్పటివరకు రూ.880 కోట్లు విరాళాలు వచ్చాయన్నారు. ఈ ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు చెప్పారు.  శ్రీవాణి ట్రస్టు ద్వారా ఇప్పటివరకు 2,500 ఆలయాల నిర్మాణం చేపట్టామన్నారు. ట్రస్టు ద్వారా ఇస్తున్న కాంట్రాక్టులపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే కాంట్రాక్టులు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇలా ఇష్టమొచ్చినట్లు తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.