iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌!

తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దిరోజుల నుంచి వర్షాల జాడే లేకుండా పోయింది. వర్షాల స్థానంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండాకాలాన్ని తలపిస్తూ.. గరిష్ట స్థాయిలో ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఆగస్టు నెల మొత్తం ఈ పరిస్థితే నెలకొంది. అడపాదడపా వర్షాలు పడ్డాయి. అది కూడా చిరు జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఎల్‌నినో ఎఫెక్ట్‌ కారణంగా వర్షాలు పడలేదు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.

ఈ నెలలో మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ భారత దేశంతో పాటు మధ్య భారత్‌లో ఈ వారం వర్షాలు పడతాయని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ మహాపాత్ర గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జులైలో అధిక వర్షాల తర్వాత ఆగస్టు నెలలో వర్షాలు ముఖం చాటేశాయన్నారు. నెలలో 20 రోజుల పాటు ఎక్కడా చినుకుపడలేదని, ఎల్‌నినో పరిస్థితుల కారణంగానే ఇలా అయిందని అన్నారు. అరేబియా మహా సముద్రం, బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్టోగ్రతల్లో తేడాల కారణంగా ఎల్‌నినో సానుకూలంగా మారుతోందని చెప్పారు.

తూర్పు దిశగా మేఘాల పయనం, ఉష్ణమండల ప్రాంతాల్లో వర్షపాతం రుతుపవనాల పునరుద్ధరణకు సానుకూలంగా మారుతున్నాయన్నారు. సెప్టెంబర్‌ నెలలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అధిక ఉష్టోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. సెప్టెంబర్‌ నెలలో 167.9 మిల్లీమీటర్లకు 9 శాతం అటుఇటుగా సగటు వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. సెప్టెంబర్‌ నెలలో అధికంగా వర్షాలు పడ్డా.. జూన్‌-సెప్టెంబర్‌ కాలపు వర్షపాతం సాధారణం కంటే తక్కువగానే ఉండొచ్చని అన్నారు. మరి, సెప్టెంబర్‌ నెలలో మళ్లీ వర్షాలు కురుస్తాయన్న వాతారణ శాఖ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.