Venkateswarlu
Venkateswarlu
భార్యాభర్తల బంధం అనేది ఎంతో అందమైనది. ఒకసారి పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి మీద మరొకరికి ప్రేమానురాగాలు ఏర్పడతాయి. ఎన్ని గొడవలు ఉన్నా ముందుకు సాగేలా చేస్తుంటాయి. ఎదుటి వ్యక్తికి ఏమైనా అయితే.. తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. అంతేకాదు! భార్యాభర్తల్లో ఎవరు చనిపోయినా.. మిగిలిన వ్యక్తి జీవితం అగమ్యగోచరం అవుతుంది. బాధాతప్త హృదయంతో మిగిలిన జీవితాన్ని కొనసాగించేలా చేస్తుంది. తాజాగా, ఓ వ్యక్తి చనిపోయిన తన భార్య జ్ఞాపకాలతో కొన్ని నెలలు నరకం అనుభవించాడు.
కుమారుడి పెళ్లి సందర్భంగా.. అతడికి తల్లిలేని లోటు తీర్చడానికి.. భార్య విగ్రహాన్ని చేయించి పెళ్లి మండపంలో పెట్టించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నంద్యాల జిల్లాలోని డోన్‌కు చెందిన ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ మర్రి గోవిందరాజులు భార్య శ్రీదేవి గత మే ఒకటిన చనిపోయింది. భార్య అనారోగ్యంతో చనిపోయినప్పటినుంచి గోవిందరాజులు మానసికంగా కృంగిపోయాడు. అయితే, మరికొన్ని రోజుల్లో కుమారుడు సిద్ధార్ధ్ పెళ్లి ఉండటంతో ధైర్యం తెచ్చుకున్నాడు.
అంతేకాదు! పెళ్లిలో కుమారుడికి తల్లిలేని లోటు తెలియకూడదన్న ఉద్ధేశ్యంతో వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. మధురైలో శ్రీదేవి సిలికాన్ విగ్రహాన్ని చేయించాడు. ఈ నెల 26న హైదరాబాద్‌లో పెళ్లి జరుగుతున్న నేపథ్యంలో విగ్రహాన్ని అక్కడికి తీసుకెళ్లారు. ఆ విగ్రహం చూసి సిద్ధార్థ్‌తో పాటు, ఇతర కుటుంబసభ్యులు, బంధువులు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తనకు తోడుగా ఉన్న భార్య మీద ప్రేమతో గోవింద రాజులు ఆమె విగ్రహాన్ని చేయించటంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.