iDreamPost
android-app
ios-app

కేంద్ర మాజీ మంత్రి కావూరి కుమార్తె అరెస్ట్‌!

కేంద్ర మాజీ మంత్రి కావూరి కుమార్తె అరెస్ట్‌!

కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ శివరావు కుమార్తె శ్రీవాణిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. చీటింగ్‌ కేసుకు సంబంధించిన విషయంలో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలో ఆమెపై చీటింగ్‌ కేసు నమోదు కావటంతో లుకౌట్‌ నోటీస్‌ జారీ అయింది. దీంతో మహారాష్ట్ర పోలీసులు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆమె శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉందన్న పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లారు.

ఎయిర్‌పోర్టులోనే శ్రీవాణిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను రాజేంద్రనగర్ కోర్టులో హాజరు పరిచి పీటీ వారంట్‌ మీద మహారాష్ట్రకు తరలించనున్నారు. ఇక,  ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలైతే బయటకు రాలేదు. గతంలో ఆమె 18 బ్యాంకుల నుంచి రూ.1,000 కోట్ల రుణాలు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. 2015లో 18 బ్యాంకులకు చెందిన సిబ్బంది.. శ్రీవాణికి చెందిన ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. ఆమె బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించటం లేదని వారు ఆరోపించారు.

ఇప్పుడు ఏ చీటింగ్‌ కేసులో అరెస్ట్‌ చేశారన్నది తెలియరాలేదు. కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కావూరి సాంబశివరావు ఓ వెలుగు వెలిగారు. రాజకీయాల్లో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 5 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఓ సారి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఆ పరిస్థితులు తలకిందులు అయ్యాయి. కావూరి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇక, అప్పటినుంచి సైలెంట్‌గా ఉంటున్నారు. మరి, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ శివరావు కుమార్తె శ్రీవాణిని చీటింగ్‌ కేసులో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్‌ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.