AP విద్యార్ధిని జాహ్నవి మృతి కేంద్రానికి CM జగన్‌ లేఖ

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కందుల జాహ్నవి అనే విద్యార్థిని.. ఈ ఏడాది జనవరి 23న అమెరికాలో మృతి చెందిన సంగతి తెలిసిందే. జాహ్నవి రోడ్డు దాటుతుండగా.. పెట్రోలింగ్‌ వాహనం ఢీకోనడంతో.. మృతి చెందింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న అమెరికన్‌ పోలీస్‌ అధికారి.. జాహ్నవి మృతిని అపహాస్యం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జాహ్నవి జీవితాన్ని చులకన చేస్తూ.. సదరు అమెరికన్‌ అధికారి చేసిన వ్యాఖ్యలతో పాటు అతడి ప్రవర్తన మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా ఈ ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందిస్తూ.. కేంద్ర విదేశాంగ మంత్రికి లేఖ రాశారు. ఈ దురదృష్టకర సంఘటనపై సమగ్రంగా విచారించి.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని సీఎం జగన్‌ కేంద్రాన్ని కోరారు.

సీఎం జగన్‌ కేంద్రానికి లేఖ రాస్తూ.. ‘‘ఏపీకి చెందిన కందుల జాహ్నవి అనే యువతి.. అమెరికాలోని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్శిటీ సీటెల్‌ క్యాంపస్‌లో ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 23న.. పోలీస్‌ వాహనం ఢీకొట్టడంతో జాహ్నవి మృతి చెందింది. ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాహ్నవి కుటుంబాన్ని, అమెరికాలోని తెలుగు అసోసియేషన్‌ను సంప్రదించి మృతదేహాన్ని కర్నూలు జిల్లాలోని ఆమె స్వగ్రామానికి తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఆమె స్వగ్రామం వరకు అంబులెన్స్‌ని కూడా ఏర్పాటు చేసింది’’ అని తెలిపారు.

‘‘తాజాగా కందుల జాహ్నవి కేసును దర్యాప్తు చేస్తున్న ఒక పోలీస్‌ అధికారి (సీటెల్‌ పోలీస్‌ అధికారి) ఆమె మరణాన్ని అపహాస్యం చేస్తున్నట్లు వచ్చిన వీడియోను అందరూ చూసే ఉంటారు. ఆ వీడియోలో సదరు అధికారి.. ఒక అమాయక విద్యార్ధి జీవితాన్ని తక్కువ చేసి మాట్లాడారు. నాన్-అమెరికన్ పౌరుల పట్ల అలాంటి అధికారుల అమానవీయ ప్రవర్తనను ప్రతి ఒక్కరు ఖండించాలి. తప్పు చేసిన పోలీసు అధికారిపై కఠిన చర్యలకు సిఫార్సు చేయాలి. భారతీయులలో విశ్వాసం, భరోసా కల్గించేలా చర్యలు ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను’’ అని జగన్‌ రాసుకొచ్చారు.

‘‘జాహ్నవి మృతి విషయంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను అభ్యర్ధిస్తున్నాను. ఈ దురదృష్టకర పరిస్ధితిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుకుంటున్నాను. అమెరికాలోని సంబంధిత అధికారులతో తక్షణమే చర్చించి, వాస్తవాలు వెలికితీసి మృతురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి. అంతేకాక భారత్‌లోని అమెరికా రాయబారితో కూడా చర్చించి తగిన సూచనలివ్వడమే కాక.. కందుల జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని సీఎం జగన్ కేంద్ర విదేశాంగ శాఖకు రాసిన లేఖలో కోరారు. మరోవైపు, ఈ ఘటనపై భారత్ కూడా తీవ్రంగా స్పందించింది. బాడీ క్యామ్ ఫుటేజ్‌పై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కేంద్ర ప్రభుత్వం డిమాండ్‌ చేసింది.

Show comments