P Venkatesh
P Venkatesh
దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రులు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో అమ్మవారిని కొలుస్తున్నారు. విద్యుత్ కాంతులతో అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ క్రమంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొమ్బిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు భక్తులకు పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు ఏయే అవతారాల్లో దర్శమివ్వనున్నారో ఇప్పుడు చూద్దాం.
మొదటి రోజు శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రీదేవి, మూడో రోజు అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు మహాలక్ష్మీదేవి, ఐదో రోజు శ్రీమహాచండీదేవి, ఆరో రోజు జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఏడో రోజు లలితాత్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజున మాత్రం రెండు అలంకారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుండటం విశేషం. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. ఈసారి శరన్నవరాత్రోత్సవాల్లో అమ్మవారు మొదటిసారిగా శ్రీ మహాచండి దేవి గా దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 15న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. దసరా ఉత్సవాల్లో భక్తులకు పూర్ణ ఫలం ఇచ్చే అలంకారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి.
శ్రీ గాయత్రీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా దర్శమిస్తారు. అమ్మవారిని గాయత్రీ అలంకారంలో దర్శించుకోవడం వలన ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ.. తల్లిని దర్శించడం వలన సకల మంత్రం సిద్ధి తేజస్సు, జ్ఞానం పొందుతారు.
శ్రీ అన్నపూర్ణాదేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 17న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గాదేవిని దర్శించి తరించడం వలన అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నదానం చేసే భాగ్యాన్ని పొందుతారు.
శ్రీ మహాలక్ష్మీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 18న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ గా దర్శనమిస్తారు. మంగళప్రదమైన అమ్మవారిని ఈ రూపంలో దర్శించుకోవడం ధన, ధాన్య, సౌభాగ్య, సంతాన వరాలను అందిస్తుందని నమ్మకం. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిని దర్శించుకోవడం వలన భక్తులకు ఐశ్వర్య ప్రాప్తి, విజయం లభిస్తుంది.
శ్రీ మహాచండి దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 19న శ్రీ కనకదుర్గ అమ్మవారు మహా చండీ దేవి ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారిని పూజించిన వారికి ధైర్యం, విజయం సిద్ధిస్తుంది.
శ్రీ సరస్వతీదేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 20న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శమిస్తారు. ఈ అలంకారంలో అమ్మ వారిని కొలవడం వలన విద్యార్థినీ విద్యార్థులకు విజయం సిద్ధిస్తుంది.
శ్రీ లలితా త్రిపురసుందరీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 21న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తారు. వాత్సల్య రూపిణిని దర్శనం ఉపాసకులకు అనుగ్రహాన్ని ఇస్తుంది.
శ్రీ దుర్గాదేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 22న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం భక్తులకు సకల శుభాలను కలుగజేస్తుంది.
శ్రీ మహిషాసుర మర్ధనీ దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 23న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసుర మర్ధనీ దేవిగా దర్శనమిస్తుంది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించడం వలన సర్వదోషాలు తొలగి దైర్యం విజయాలు చేకూరతాయి.
శ్రీ రాజరాజేశ్వరి దేవి
శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 23న మధ్యాహ్నం 1గంట నుంచి రాత్రి 11 వరకు శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు. ఈ అలంకారంలో అమ్మవారి దర్శనం సకల శుభాలు, విజయాలు చేకూరతాయి.