Arjun Suravaram
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. మనిషికి విద్యా, వైద్యం అతి ముఖ్యమైన అవసరాలని గుర్తించిన వ్యక్తి సీఎం జగన్. అందుకే పేదలకు వైద్యం విషయంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోకూడదనే ఆలోచనలో ఆరోగ్య శ్రీ వంటి పలు వైద్య పథకాలను ప్రారంభించారు. తాజాగా ప్రజల వద్దకే వైద్యం అనే కాన్సెప్ట్ తో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రోగ్రామ్ స్పెషలిస్టు డాక్టర్ల పర్వవేక్షణలో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి ఏపీ ప్రభుత్వానికి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ఐఏఎస్ డాక్టర్ జయప్రకాశ్ … ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
ఏపీలో అమలు చేస్తున్న ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం దేశానికే ఆదర్శమని.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ గ్రామీణ ప్రాంతంలోని ప్రతి కుటుంబం వద్దకు వైద్యులను, ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని డాక్టర్ జయప్రకాశ్ నారాయణ కొనియాడారు. బేస్ లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా పేదల ఆరోగ్యంపై శ్రద్ధకు శ్రీకారం చుట్టారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆరోగ్య శ్రీ రూపంలో ఇప్పుడు సీఎం జగన్ నాయకత్వంలో ఆరోగ్య సురక్ష ద్వారా అధ్వానంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థకు జీవం పోశారు. దేశంలోని కోట్లాది మంది ప్రజలు అనారోగ్యం, సరైన వైద్యం అందక, వైద్య ఖర్చులు భరించలేక పేదరికంలోకి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం శుభ పరిణామం అని జయప్రకాశ్ నారాయణ ప్రశంసించారు.
‘ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే సదుపాయం కల్పిస్తుండటంతో.. ఆస్పత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోంది. నేటి కాలంలో మనిషి జీవన శైలిలో వచ్చిన మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది’ అంటూ వీడియో సందేశంలో జయప్రకాశ్ నారాయణ ఏపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. మరి సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఆరోగ్య సురక్ష పథకంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.