ఇటీవల కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతా వర్షాలు కురుస్తున్నాయి. అలానే మెరుపులతో కూడిన వానాలు పడుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వానల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ క్రమంలో తాజాగా ఆదివారం రాత్రి వాతావరణ శాఖ ఏపీ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు, ఎల్లుడి భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న మధ్య బంగాళాఖాతం మధ్యలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇదే సమయంలో మరోవైపు రాష్ట్రంపైకి వాయవ్య దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో సోమ వారంతో పాటు రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయి. అలానే ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్నరెండు రోజుల్లో దక్షిణ కోస్తా, సీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది.
ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో భారీవర్షాలు కురవవచ్చని పేర్కొంది. పలుచోట్ల వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని హెచ్చరించింది. గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సోమ, మంగళ వారాల్లో ఏపీలోని మన్యం, అల్లూరి, కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లా, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. అలానే బుధవారం పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.