తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన.. రాబోయే మూడు రోజులు!

గత కొన్ని రోజులుగా భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికాయి. రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వరదలు జన జీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరద నీరు తగ్గినప్పటికి.. ఇళ్లల్లో బురద, మట్టి చేరి.. మునపటి స్థితికి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. గత మూడు రోజులుగా వర్షాలకు కాస్త బ్రేక్‌ పడింది. కానీ మళ్లీ త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. త్వరలోనే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని.. అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గర్లో ఉందని.. దాని వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలపింది. ఈ అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుంది అని ఐఎండీ వెల్లడించింది.

అల్పపీడన ప్రభావం కారణంగా రానున్న మూడు రోజుల పాటు ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ అల్పపీడనం ప్రభావం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందంటున్నారు.

తెలంగాణలో..

ఏపీలో వర్షాలు తగ్గినప్పటికి.. తెలంగాణలో మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసాయి. హైదరాబాద్‌లో కూడా ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో స్వల్ప వర్షం కురిసింది. ఇక అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో.. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వానలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ అంచనా వేసింది. పశ్చిమబెంగాల్, ఒడిశా తీరంలో అల్పపీడనం మాత్రమే కాక నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రాష్ట్రంలో మరో రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనుండగా.. రేపు పలు జిల్లాల్లో భారీ వానలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Show comments