శ్రావణమాసం కావడంతో మహిళా భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో అమ్మవారిని పూజిస్తుంటారు. అలానే పసుపు కొమ్ములు, పసుపు పుష్పాలతో సౌభాగ్యని దేవిగా, వివిధ దేవత మూర్తుల రూపంలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు.. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్నాయి. ఇక పవిత్ర శ్రావణమాసం కావడంతో ప్రతి శుక్రవారం ఒక అలంకరణలో ఇక్కడ వరమహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. అలానే తూర్పుగోదావరి జిల్లాలోని నవదుర్గాదేవిని లక్ష గాజులతో అలంకరించారు. గాజులతో అలంకరించ బడిన అమ్మవారు అందరిని ఆకట్టుకుంది.
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలోని నవదుర్గాదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దసరా నవరాత్రులు, శ్రావణ మాసం సమయాల్లో ఈ ఆలయం విద్యుత్ కాంతులతో వెలిగి పోతుంది. ప్రతి రోజూ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తుంటారు. ఇక్కడ నవదుర్గ అమ్మవారికి అర్చక స్వాములు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆషాడ, శ్రావణ, కార్తిక మాసాలలో అత్యంత వైభవంగా పూజలు జరుగుతూ ఉంటాయి.
అలానే ఇప్పుడు శ్రావణ మాసంలో కూడా నవదుర్గదేవిని అలంకరిస్తున్నారు. ఇక గురువారం లక్ష గాజులతో నవదుర్గా దేవిని అలంకరించారు. ఆలయ అర్చకుడు శివ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్కక్రమాలు నిర్వహించారు. బంగారుపూత కలిగిన వెండి పుష్పాలను సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చారు. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేసినట్లు అర్చకుడు వెల్లడించారు. ఇటీవలే ఓ ప్రాంతంలో అమ్మవారికి లక్షల నోట్ల కట్టలతో అలంకరించారు. అలానే కూరగాయలు, పండ్లతో కూడా అమ్మవార్లను అలకరించారు.