Dharani
Dharani
మన దగ్గర పార్టీలు, రాజకీయ నేతలు, హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా, సభాస్థలిలో ఫైటింగ్‌లు చోటు చేసుకోవడం కామన్. మన దగ్గర ఎలా ఉన్నా పర్లేదు.. కానీ వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మన పరువు మనమే తీసుకున్నవాళ్లం అవుతాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. అమెరికా వేదికగా జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభల్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. తానా సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవివరాలు..
తానా తెలుగు మహా సభలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది తానా 23వ మహాసభలను శనివారం పెన్సిల్వేనియాలో ఘనంగా ప్రారంభించారు. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రిటైర్డ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే నందమూరి తదితరులు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. తొలిరోజు సమావేశాలు ముగిసిన అనంతరం.. ఈ వివాదం ప్రారంభం అయినట్లు తెలిసింది. టీడీపీకి సంబంధించిన అంశాలపై తరని పరుచూరి, సతీశ్ వేమన వర్గాల మధ్య వివాదం రాజుకుంది. మాటామాటా పెరిగి చొక్కాలు పట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లింది వ్యవహారం. టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
తానా సభలో జై ఎన్టీఆర్ అనడం పట్ల తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నేతలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నట్టు చెబుతున్నారు. ఇరు వర్గాలు చొక్కాలు పట్టుకుని ఈడ్చుకున్నారు. కాళ్లతో తన్నుకున్నారు. చేతులతో పిడిగుద్దులు గుద్దుకున్నట్లు తెలుస్తోంది. చాలా సేపటి వరకూ గొడవ జరుగుతూ వుందని.. అసలు ఈ గొడవకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే కారణమని ఒక వర్గం వారు చెబుతున్నారు. సభ జరుగుతుండగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని… తన ఆరాధ్య టాలీవుడ్ హీరో పేరు ప్రస్తావిస్తూ జై కొట్టడంతో గొడవ ప్రారంభమైంది అని సమాచారం.