భారతదేశ రాజకీయాల్లో ఉద్ధండులైన, కాకలుతీరిన మహా నేతలు ఎంతో మంది ఉన్నారు. కానీ వారిలో జనాల గుండెల్లో నిలిచిన నేతలు మాత్రం అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. మరణించి కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉన్న అమరజీవి ఆయన. వైఎస్సార్ ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు కొనసాగిస్తున్నాయంటే ఆయన ముందు చూపు ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. కాగా.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14 వర్ధంతిని ఘనంగా నిర్వహించారు వైఎస్సార్ అభిమానులు. సింగపూర్ ఎన్నారైల బృందం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా భావోద్వేగానికి గురైంది. ఇప్పుడు మేం ఈ స్థాయిలో ఉండటానికి కారణం YSR అని ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు సింగపూర్ ఎన్నారైల బృందం.
దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని సింగపూర్ ఎన్నారైల బృందం ఘనంగా నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఆయన సుభిక్ష పాలనను గుర్తుచేసుకున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్సుమెంట్ వల్లే.. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామని సింగపూర్ ఎన్సారైల బృందంలో కొందరు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వారు ఒక్కింత భావోద్వేగానికి గురైయ్యారు. రాష్ట్రాన్ని ఎంతో మంది సీఎంలు పాలించినా కూడా.. వైఎస్సార్ ఒక్కరే ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు. చనిపోయినా కూడా ప్రజల్లో గుండెల్లో నిలిచిన వైఎస్సార్ దే నిజమైన అమరత్వం అంటూ కీర్తించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ ఎన్నారై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్ కోటిరెడ్డి, కన్వీనర్ మురళి కృష్ణ, కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.