Dharani
Dharani
విశాఖపట్నం మరో అరుదైన ఘనతకు వేదిక కానుంది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ విశాఖలో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం (ఆగస్ట్ 1)కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్‌ను అభివృద్ధి చేయనుంది. తొలి దశ పనులకు సీఎం జగన్ మంగళవారం భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇనార్బిట్ మాల్ ఏర్పాటుతో సుమారు 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఇందులో రెండున్నర ఎకరాల స్థలాన్ని ఐటీ కోసం కేటాయిస్తారని వెల్లడించారు. ఇనార్బిట్ మాల్ విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు అని అభివర్ణించారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. దీని నిర్మాణంతో విశాఖ రూపురేఖలు మారిపోతాయన్నారు. రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సహకరిస్తామని.. ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటామని తెలిపారు సీఎం జగన్.
మొత్తం మూడు దశల్లో ఇనార్బిట్ మాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా ఫేజ్ 1 లో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి కె. రహేజ కార్ప్ గ్రూప్ రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టడి.. 6 లక్షల చదరపు అడుగలలో మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతం నిర్మించనుంది. 2026 కల్లా దీన్ని పూర్తి చేసేలా ప్రణాళిక రచించారు. 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్స్, మల్టిప్లెక్స్‌లు, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్తో మాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇనార్బిట్ మాల్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుందని అంచాన వేస్తున్నారు.
రెండో దశలో దాదాపు 3000 మంది ఉద్యోగులకు సరిపడేలా 2.5 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ నిర్మాణం చేపట్టనున్నారు. 2027 నాటికి ఇది పూర్తయ్యేలా ప్రణాళికలు రచించారు. ఇక మూడో దశలో 200 గదులతో 4/5 స్టార్ హోటల్ నిర్మాణం చేపట్టనున్నారు. 2029 నాటికి దీని కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో ముందడుగు వేయనున్నారు. పూర్తి పర్యావరణహితంగా ఈ భవనాన్ని నిర్మించనున్నారు.
విశాఖ పర్యటన సందర్భంగా సీఎం జగన్ మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. అలానే జీవీఎంసీ పరిధిలో చేపడుతున్న మరి కొన్ని ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపన చేశారు. వీటి విలువ సుమారు 135.88 కోట్ల రూపాయలుగా ఉండనుంది. వీటితో పాటు ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు.
ఏ హబ్ (ఆంధ్ర యూనివర్శిటీ స్టార్టప్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్) ను రూ. 21 కోట్ల వ్యయంతో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగులతో దేశంలోనే అతి పెద్ద మల్టి డిసిప్లేనరీ ఇంక్యుబేషన్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో ఒకటిగా ఉండాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నారు. ఇందులో భాగంగా మల్టి సెక్టార్ బేస్‌డ్ ఇంక్యుబేషన్ సెంటర్స్, అనెక్స్ సెంటర్స్, ప్రొటొటైపింగ్–మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయనున్నారు.