Dharani
Dharani
నవరత్నాల పేరుతో.. రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా సంక్షేమ పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అధికారంలోకి వచ్చాక నవరత్నాలు మాత్రమే కాక.. ప్రజలకు మేలు చేసే ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అనారోగ్యంతో బాధపడేవారిని గుర్తించి.. వారికి మెరుగైన చికిత్స అందించేందుకు గాను.. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన ఇంటింటి సర్వేకు అదనంగా శనివారం నుంచి తొలి వైద్య శిబిరం ప్రారంభం కాబోతుంది.
మొత్తంగా 5 దశల్లో జరిగే ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్‌ఓలు, ఇతర సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలి అని సీఎం జగన్ ఆదేశించారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత చికిత్సలు, అనుబంధ ఆసుపత్రుల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష కింద.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్లి.. అనారోగ్యంతో బాధపడేవారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించేందుకుగాను.. ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుమని ఈసందర్భంగా సీఎం జగన్ తెలిపారు. దీనిలో భాగంగా.. ఇళ్ల వద్దనే కుటుంబంలో ఎంత మంది ఉంటే వారందరికి.. ఏడు రకాల పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ సర్వే ద్వారా.. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గుర్తించిన వారికి గ్రామాల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద జరిగే వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్టు వైద్యుల ద్వారా చికిత్స అందిస్తామన్నారు. దీనిలో భాగంగా.. శనివారం అనగా సెప్టెంబర్ 30 నుంచి నవంబరు 15వ తేదీ వరకు (45 రోజులపాటు) వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల నిర్వహణలో వాలంటీర్లు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్తలు భాగస్వాములు కానున్నారు.
ఈ 45 రోజుల పాటూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇద్దరు ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులతోపాటు మరో ఇద్దరు వైద్య నిపుణులు హాజరై రోగులకు వైద్య పరీక్షలు చేస్తారు. వారికి బీపీ, హెచ్‌బీ, ఆర్‌బీఎస్, మూత్ర, డెంగ్యూ, మలేరియా, ఉమ్మి వంటి 7 రకాల పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలో 112 రకాల మందులను అందుబాటులో ఉంచి పంపిణీ చేయనున్నారు.
దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు వస్తే.. వారిని జిల్లా స్థాయి వైద్య నిపుణుల వద్దకు పంపుతారు. ఇటువంటి రోగులకు అందుతున్న వైద్య సేవలను నిరంతరాయంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్‌ను ప్రతి కుటుంబంలో ఒక మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొనేలా అవగాహన కల్పిస్తారు. పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం తయారీపై సూచనలు, సలహాలు కూడా ఇవ్వనున్నారు.