బాపట్ల జిల్లా పర్చూరు వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాము కాటుకు గురయ్యారు. పొట్టి సుబ్బయ్యపాలెం సమీపంలోని ఆయన సొంత రొయ్యల ఫ్యాక్టరీలోనే ఈ ఘటన జరిగింది. ఫ్యాక్టరీ ఆవరణలో వాకింగ్ చేస్తుండగా ఆమంచిని పాము కాటేసింది. విషయం తెలుసుకున్న అనుచరులు ఆయన్ను వెంటనే చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమంచి కృష్ణమోహన్ కు వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ఆమంచిని విజయవాడలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. కాకపోతే 6 గంటలపాటు అబ్జర్వేషన్ లో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. ఆమంచికి పాముకాటు అని తెలియగానే ఆయన అనుచరులు, వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. అయితే ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న తర్వాత కుదుటపడ్డారు. ఆయన వెంటనే కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆకాంక్షింస్తున్నారు.