TDP రెండో జాబితా విడుదల.. పలువురు సీనియర్లకు షాక్!

TDP Second List: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాలో చాలా వరకు పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు. పార్టీ కోసం ఎంతో కృషి చేసిన పలువురు సీనియర్ల పేర్లు రెండో జాబితాలో లేదు. ఈ ఎన్నికల్లో పలువురు సీనియర్లకు బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.

TDP Second List: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల రెండో జాబితాలో చాలా వరకు పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు. పార్టీ కోసం ఎంతో కృషి చేసిన పలువురు సీనియర్ల పేర్లు రెండో జాబితాలో లేదు. ఈ ఎన్నికల్లో పలువురు సీనియర్లకు బాబు హ్యాండిచ్చినట్లేనన్న ప్రచారం జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నిక వాతావరణం మొదలైంది. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, సీఏం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సిద్ధం పేరుతో నాలుగు సభలు నిర్వహించి.. విపక్ష కూటమిని బెంబేలు ఎత్తిస్తున్నాడు. దాదాపు అభ్యర్థుల అందరిని ఖరారు చేసి.. వారిని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలోనే టీడీపీ తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పలువురు సీనియర్లకు చుక్కెదురైంది. రెండో జాబితా ప్రకారం.. పలువురు సీనియర్లకు ఆ పార్టీ అధినేత  చంద్రబాబు షాకిచ్చినట్లు అయ్యింది.

ఆంధ్ర్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఈనేపథ్యంలో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి కూటమిగా ఎన్నికల బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. గతంలో 94 మంది పేరుతో తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. తాజాగా 34 మంది పేర్లతో రెండో జాబితాను విడుదల చేశారు. దీంతో రెండు జాబితాల కలిపి ఇప్పటి వరకు 128 మంది బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాలకు  అభ్యర్థులను టీడీపీ ప్రకటించాల్సి ఉంది.

తొలి జాబితా మాదిరిగానే రెండో జాబితాలోను  సీనియర్లకు చంద్రబాబు షాకిచ్చారు. రెండో జాబితాలో కూడా పలువురు సీనియర్ల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేతల పేర్లు ఈ జాబితాలో కనిపించలేదు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తికి రెండో జాబితాలో చోటు దక్కలేదు. అలానే చోడవరం నియోజవర్గంలో టీడీపీ ముఖ్యనేత బత్తుల తాతయ్య బాబుకు రెండో లిస్ట్ లో మొండి చేయ్ ఎదురైంది. మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పీవీజీ కుమార్‌కు నిరాశ మిగిలింది. ఇక్కడి నుంచి ఎన్నారై ఫైళ ప్రసాద్ కు చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అలానే జనసేన ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన గాజువాక విషయంలో నిరాశే మిగిలింది. ఇక్కడి నుంచి పవన్ కల్యాణ్ మరోసారి పోటీచేస్తారని జనసేన నేతలు భావించారు.

జనసేన ఖాతాల్లో మిగిలిన 19 స్థానాల్లో గాజువాక ఉంటుందని అనుకున్నారు. అయితే తాజాగా గాజువాక స్థానానికి టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది. గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్‌కు కేటాయింపు. అలానే నెల్లూరు జిల్లాలో కీలక నేత అయినా  మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు కూడా రెండో జాబితాలో లేదు. అలానే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు పేరు కూడా రెండో జాబితాలో కనిపించలేదు. సెకండ్ లిస్ట్ లో పేర్లులేని వారు తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులను, సీనియర్లను చంద్రబాబు పట్టించుకోలేదనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. జాబితాలో పేర్లులేని నేతలు తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Show comments