Chandrababu Naidu Remand Khaidi Number 7691: రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకి చంద్రబాబు.. ఖైదీ నంబర్‌ ఎంతంటే

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకి చంద్రబాబు.. ఖైదీ నంబర్‌ ఎంతంటే

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలవప్‌మెంట్‌ కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టు భారీ షాక్‌ ఇచ్చింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలి సారి చంద్రబాబు.. జ్యూడీషియల్‌ రిమాండ్‌కు వెళ్లారు. ఆదివారం సాయంత్రం.. ఏసీబీ కోర్టు.. చంద్రబాబుకు రిమాండ్‌ విధించింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు.. చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తీర్పు తర్వాత వానలోనే చంద్రబాబు వాహనం రాజమహేంద్రవరం బయలుదేరింది. ఆదివారం అర్థరాత్రి.. 1.16 గంటల సమయానికి చంద్రబాబు వాహన శ్రేణి రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్‌ వద్దకు చేరుకుంది.

ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు.. జైలు అధికారులు.. చంద్రబాబుకు స్నేహా బ్లాక్‌లో ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. అంతేకాక కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు అన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. జైలు గేటు దగ్గర నుంచే ఎన్ఎస్‌జీ కమాండోలు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం లోకేశ్‌ లోపలికి వెళ్లి చంద్రబాబుకు ఇవ్వాల్సిన ఆహారం, మందుల గురించి అధికారులతో మాట్లాడి వచ్చారు. అలాగే కుటుంబ సభ్యులు.. ఏ సమయంలో చంద్రబాబును కలవవచ్చో.. అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాజమహేంద్రవరం జైలులో తనకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని చంద్రబాబు ఏసీబీ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. తన వయసు, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా.. జైలులో తనకు ప్రత్యేక ఏర్పాట్లు అవసరమని చంద్రబాబు కోర్టుకు వెల్లడించారు. దాంతో కోర్టు.. జైలులో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు బయట నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అవకాశం కల్పించారు. చంద్రబాబును రిమాండ్‌ నేపథ్యంలో.. రాజమహేంద్రవరం జైలు వద్ద సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Show comments