iDreamPost
android-app
ios-app

రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు తొలి రోజు గడిచిందిలా!

  • Published Sep 12, 2023 | 8:50 AM Updated Updated Sep 12, 2023 | 8:50 AM
  • Published Sep 12, 2023 | 8:50 AMUpdated Sep 12, 2023 | 8:50 AM
రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో చంద్రబాబు తొలి రోజు గడిచిందిలా!

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో అరెస్టై.. రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో.. చంద్రబాబు జైలుకు వెళ్లడం… ఇదే తొలిసారి. ఇక జైల్లో చంద్రబాబు తొలిరోజు ఎలా సాగిందనే దాని మీద జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైల్లోని స్నేహ బ్యారక్‌లో ఆయనకు ప్రత్యేకంగా కేటాయించిన గదిలో ఉంటున్నారు. ఇక తొలిరోజు అనగా సోమవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో నిద్ర లేచారు చంద్రబాబు. డాక్టర్లు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇక చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచారు.

ఇక చంద్రబాబుకి ఇంటి నుంచే ఆహారం పంపించారు. సోమవారం ఉదయం అల్పాహారంగా ఫ్రూట్‌ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్‌ కాఫీని పంపించారు చంద్రబాబు కుటుంబ సభ్యులు. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్‌ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలుస్తోంది. రాత్రి కూడా ప్యాంట్రీకార్‌ నుంచే పుల్కాలు, పెరుగు అన్నం తెప్పించి అందించారు. స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో.. అక్కడే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపు వార్తా పత్రికలు చదివారు. మొదటి రోజు చంద్రబాబు ఎక్కువసేపు తనకు కేటాయించిన గదిలోనే ఉన్నట్లు తెలిసింది.

జైల్లో చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇక సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును మొదటి రోజు ఎవరూ కలవలేదు. చంద్రబాబును కలిసేందుకు కుటుంబసభ్యులు జైళ్లశాఖ అధికారుల అనుమతి కోరారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రాహ్మణి జైలుకు వెళ్లి ఆయనను కలవాలని నిర్ణయించారు. అయితే బెయిల్‌ పిటిషన్‌పై స్పష్టత వచ్చాక ములాఖత్‌పై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. ఇక మంగళవారం చంద్రబాబును కలిసేందుకు.. ఆయన కుటుంబ సభ్యులు ములాఖత్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో 144 సెక్షన్‌ అమలు చేసిన పోలీసులు.. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం నగరంలోకి టీడీపీ కేడర్ చేరుకోకుండా కట్టడి చేశారు.