ఆ ఒక్క సెక్షన్ వల్లే బాబుకి బెయిల్ వచ్చే అవకాశం లేదా?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును ఏ1 ముద్దాయిగా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడుతూ సీఐడీ చీఫ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు దాదాపు 10 ఏళ్ జైలుశిక్ష పడే అవకాశం ఉందని సీఐడీ అదనపు డీజీ సంజయ్ వ్యాఖ్యానించారు. అన్ని ఆధారాలతోనే న్యాయపరంగానే అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? రాదా? అనే సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఐపీసీ సెక్షన్ 409 ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబుకు బెయిల్ తెచ్చే విషయంలో ఈ సెక్షన్ వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అంటున్నారు. అయితే అసలు ఆ సెక్షన్ ఏంటి? ఆ సెక్షన్ వల్ల నిజంగానే బెయిల్ రాదా?

నంద్యాలలో ఉన్న చంద్రబాబును సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. నంద్యాలలోని RK ఫంక్షన్ హాలులో నాన్ బెయిలబుల్ నేరం కింద అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు అయింది. అవినీతి నిరోధక చట్టం సెక్షన్స్ కూడా ఈ కేసులో ఉన్నాయి. ఐపీసీ సెక్షన్స్ 120(B) 166, 167, 418,420, 465, 468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 కింద కేసు నమోదైంది. 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్స్ 12, 13(2) రెడ్ విత్ 13(1)(C), (D) కూడా నమోదు చేసినట్లు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులు ఏపీ సీఐడీ డిప్యూటీ సూపరింటెండెండ్ ధనుంజయుడి పేరుతో జారీ చేశారు.

అయితే ఇప్పుడు అందరూ చంద్రబాబుకు బెయిల్ వచ్చే అంశం గురించి చర్చిస్తున్నారు. కొందరు చంద్రబాబుకు బెయిల్ రాదని చెబుతుండగా.. కొందరు మాత్రం ఐపీసీ సెక్షన్ 409 కింద బెయిల్ రావడం కష్టం అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 409 సెక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. నిజంగానే ఇది నాన్ బెయిలబులా అంటే.. అవుననే చెప్పాలి. సెక్షన్ 409 నాన్ బెయిలబుల్ అఫెన్స్. ఆస్తిని నేరపూరితంగా, తప్పుడు మార్గాల్లో పొందినప్పుడు.. ఒక పబ్లిక్ సర్వెంట్ తన అధికారాలను దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందడం ఈ సెక్షన్ కిందకు వస్తుంది. ఈ సెక్షన్ లో ముఖ్యంగా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద కేసు నమోదు అవుతుంది. ఈ సెక్షన్ కు సంబంధించి జీవిత ఖైదు/10 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా.. జరిమానా కూడా విధిస్తారు. అయితే ఈ సెక్షన్ కింద అసలు బెయిల్ రాదా అంటే.. వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది నాన్ బెయిలబుల్ అయినప్పటికీ సమర్పించిన ఆధారాలు, దర్యాప్తులో ఏమైనా ఆలస్యం జరగడం వంటి సందర్భాల్లో బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే అది కేవలం మెజిస్ట్రేట్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ సెక్షన్ కింద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇదీ చదవండి: అరెస్ట్ లోనూ చంద్రబాబు సానుభూతి రాజకీయం!

ఇదీ చదవండి: దర్యాప్తులో ప్రధాన నిందితుడు చంద్రబాబే అని తేలింది: CID చీఫ్!

Show comments