శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది భక్తులు తిరుమలకు వస్తుంటారు. తిరుపతి నుంచి వాహనాలు, కాలినడకన భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే అలిపిరి, శ్రీవారి మెట్లు.. ఈ రెండు చోట్ల నుంచి తిరుమలకు భక్తులు కాలినడకన వెళ్తుంటారు. నడక దారిన వెళ్లే భక్తులకు అప్పుడప్పుడు వన్యప్రాణాలు, సర్పాలు కనిపిస్తుంటాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతుంటారు. తాజాగా తిరుమల కాలిబాట మార్గంలో ఎలుగుబంటి ప్రత్యక్షం అయింది. దీంతో శ్రీవారి భక్తులు భయాందోళనకు గురయ్యారు.
తిరుమల కాలినడక మార్గమైన శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగు బంటి హల్ చల్ చేసింది. భల్లుకం మెట్ల మార్గంలో కనిపించిన దృశ్యాలను కొందరు భక్తులు సెల్ ఫోన్ లో రికార్డ్ చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జింకల పార్కు సమీపంలో ఈ ఎలుగు బంటి సంచరించింది. శ్రీవారి మెట్ల మార్గంలోని ఒక వైపు నుంచి మరోవైపుకు దాటి పక్కనున్న పొదల్లోకి వెళ్లింది. గత కొంతకాలంగా తిరుమల ఘాట్ రోడ్లల్లో చిరుతలు, ఎలుగు బంట్ల సంచారం ఎక్కువైందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం మూడేళ్ల బాలుడిపై చిరుత పులి దాడి చేసిన ఘటన అందరికి తెలిసిందే. చిరుత పులి దాడి అనంతరం అధికారులు దానిని బంధించారు. ఆ ఘటన మరువక ముందే.. ఇప్పుడు ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో శ్రీవారి భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. కూర్ర మృగాల సంచారంతో భద్రత సిబ్బంది , అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి టీటీడీ కీలక విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు రెండుసార్లు నిర్వహిస్తామని తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకూ శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని, అదే విధంగా అక్టోబరు 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో శ్రీవారి జంట బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. మరి.. తిరుమల నడక మార్గంలో ఇలా వన్యప్రాణాలు సంచారం జరుగుతున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: డాక్టర్ భారతికి జగన్ సర్కార్ చేయూత.. 2 ఎకరాల స్థలం, జూనియర్ లెక్చరర్ పోస్ట్!