ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాడేరు ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు 100 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మరణించినట్లుగా తెలుస్తోంది. మరో 30 మందికి ఈ ఘటనలో గాయాలు అవ్వగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక బస్సు ప్రమాదానికి గురయ్యే సమయంలో బస్సులో 60 ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేర్ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 60 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చెట్టు కొమ్మను తప్పించబోయి.. 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించినట్లుగా తెలుస్తోంది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మోదమాంబ పాదాలకు 3 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్, అధికారులు హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. 100 అడుగుల లోయలో బస్సు పడటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కాగా.. చెట్టు కొమ్మలు అడ్డు పడటంతో బస్సు పూర్తిగా లోయలో పడలేదు. ఒకవేళ బస్సు పూర్తిగా పడి ఉంటే భారీగా ప్రాణ నష్టం జరిగేదని అధికారులు తెలుపుతున్నారు.
ఇదికూడా చదవండి: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. నడిరోడ్డుపై భార్యను పొడిచి చంపిన భర్త!