iDreamPost
android-app
ios-app

Manasvi: 600 కి 599 మార్కులు! ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్? అంతా అమ్మానాన్న మహిమ!

  • Published Apr 23, 2024 | 8:22 AM Updated Updated Apr 23, 2024 | 8:22 AM

AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించి.. ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసిన మనస్వి బ్యాగ్రౌండ్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు..

AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాల్లో 599 మార్కులు సాధించి.. ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసిన మనస్వి బ్యాగ్రౌండ్‌ తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు..

  • Published Apr 23, 2024 | 8:22 AMUpdated Apr 23, 2024 | 8:22 AM
Manasvi: 600 కి 599 మార్కులు! ఈ అమ్మాయి బ్యాగ్రౌండ్? అంతా అమ్మానాన్న మహిమ!

ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి 2024 ఫలితాల్లో ఏలూరు జిల్లా, నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల ఆకుల వెంకటసాయి మనస్వి ఏకంగా 600 మార్కులకు గాను.. 599 మార్కులు సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్ లాంగ్వేజీలో తప్ప.. మిగిలిన అన్ని సబ్జెక్టుల్లో 100కు 100 మార్కులు సాధించి టాపర్‌‌గా నిలిచింది. దాంతో నిన్నటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ విద్యార్థిని పేరు మార్మొగిపోతుంది. అసలు ఎవరీ మనస్వి.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి.. తల్లిదండ్రులు ఏం చేస్తారు.. వంటి విషయాల గురించి తెలుసుకునేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. మనస్వినిని ఇంతలా ప్రోత్సాహించిన ఆమె తల్లిదండ్రుల మీద కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నాగ మనస్వి కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే..

చదువే తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది మనస్వి. ఆమె కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు కూడా చదువుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వారే. పైగా ఇద్దరూ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులు. మనస్వి తల్లి నాగ శైలజ, తండ్రి నాగ వరప్రసాదరావు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు మనస్వి ఒక్కతే సంతానం. అయితే కొందరు తల్లిదండ్రుల్లా నిత్యం క్లాస్‌ పుస్తకాలు చదవమని వారు మనస్విని ఒత్తిడి చేయలేదు. ఇద్దరూ టీచర్లే కావడంతో.. పిల్లలు ఎలాంటి వాతావరణంలో బాగా చదువుతారో వారికి తెలుసు కాబట్టి.. ఇంట్లో కూడా అదే వాతావరణం ఉండేలా చూశారు. మనస్వికి క్లాస్‌ పుస్తకాలతో పాటు.. ఇతర పుస్తకాలు చదివే అలవాటు కూడా చేశారు.

అవి కూడా మనస్వి సిలబస్‌ ద్వారా తెలుసుకున్న విషయాలకు మరికొంత సమాచారాన్ని అందించేవిగా ఉండే పుస్తకాలు అన్నమాట. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టకుండా తన మనసుకు నచ్చే పని చేసేలా మనస్వి తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సాహించారు. మొత్తంగా చెప్పాలంటే.. ఇష్టంగా చదువుకోవాలి తప్ప.. కష్టంగా కాదు అన్న వాతావరణంలో మనస్విని పెంచారు. దాని ఫలితమే పదో తరగతి రిజల్ట్స్‌లో ఆమె 600కి 599 మార్కులు సాధించేలా చేసింది. తనంతట తానుగా ఇష్టంగా చదువుకుంది తప్ప.. తల్లిదండ్రులు ఆమె మీద ఎలాంటి ఒత్తిడి తేలేదు.

ఈ సందర్భంగా మనస్వి మాట్లాడుతూ.. ‘‘నా రోల్‌ మోడల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలామ్‌. క్రికెట్‌ అంటే పిచ్చి. మ్యాచ్‌ వస్తుంటే వీలయినంత సేపు చూస్తాను. విరాట్‌ కోహ్లీ ఆట నచ్చుతుంది. ఈ ప్రపంచంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి మా నాన్న. తనకంటే బెస్ట్‌ హీరో ఎవరూ ఉండరు. మా నాన్న పాతికేళ్ల కిందట డీఎస్సీ రాశారు. కానీ గవర్నమెంట్‌ జాబ్‌ రాలేదు. దాంతో ట్యూషన్‌లు చెప్పారు. వ్యవసాయం చేశారు. గత ఏడాది గవర్నమెంట్‌ చేసిన రిక్రూట్‌మెంట్‌లో నాన్నకు ఉద్యోగం వచ్చింది. తన చదువుకు తగిన ఉద్యోగం వచ్చే వరకు ఆయన నిరాశపడకుండా ఎదురుచూశారు. ప్రతి విషయంలో నాన్నే నాకు స్ఫూర్తి’’ అని చెప్పుకొచ్చింది.

అంతేకాక ‘‘పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం కోసం నేను గైడ్‌లు, నోట్స్‌ కంటే ఎక్కువగా టెక్ట్స్‌బుక్స్‌ చదివేదాన్ని. టాపర్‌ కావాలని అని అస్సలు అనుకోలేదు. కానీ మంచి మార్కులు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అందుకు తగ్గట్టుగానే చదివాను. కానీ ఇలా 599 మార్కులు వస్తాయని అస్సలు ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నాకు మ్యాథ్స్‌ ఇష్టం. ఐఐటీలో ఇంజినీరింగ్‌ చేసి మంచి జాబ్‌ చేయాలని నా కోరిక’’ అని చెప్పుకొచ్చింది మనస్వి.

ఆమె తల్లి మాట్లాడుతూ ‘‘మనస్వి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేది. పదవ తరగతిలో చాలా కష్టపడింది. ఇక చాలు నిద్రపొమ్మని మేం చెప్పినా తను వినేది కాదు. సిలబస్‌ పూర్తి చేయకుండ పడుకునేది కాదు. దాని కోసం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి చదువుకునేది. మంచి మార్కులు వస్తాయనుకున్నాం. కానీ ఇన్ని మార్కులు తెచ్చుకుంటుందని.. ఆల్‌టైమ్‌ రికార్డు సాధిస్తుందని ఊహించ లేదు. తల్లిదండ్రులుగా మాకు ఇంతకంటే సంతోషం  ఏముంటుంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె. ఇక టెన్త్‌లో మనస్వి రికార్డు బ్రేక్‌ చేయడం ఇప్పట్లో అసాధ్యం అంటున్నారు.