iDreamPost
android-app
ios-app

10వ తరగతి విద్యార్థులకు అలర్ట్‌.. ఈ ఏడాది పెరగనున్న పరీక్ష పేపర్లు..

  • Published Aug 09, 2023 | 9:08 AM Updated Updated Aug 09, 2023 | 9:08 AM
  • Published Aug 09, 2023 | 9:08 AMUpdated Aug 09, 2023 | 9:08 AM
10వ తరగతి విద్యార్థులకు అలర్ట్‌.. ఈ ఏడాది పెరగనున్న పరీక్ష పేపర్లు..

పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి పదో తరగతి పరీక్ష పేపర్లు పెంచనున్నట్లు ప్రకటించింది. గత ఏడాది ఏపీలో 10వ తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లు ఉండగా.. ఈ ఏడాది ఏడు పేపర్ల విధానం అమలు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి బొత్త సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది నుంచి భౌతిక, రసాయన శాస్త్రాలను కలిపి ఒక పేపర్‌గా 50 మార్కులకు, జీవశాస్త్రం పేపర్‌ను 50 మార్కులకు మరో ప్రశ్నపత్రంగా ఇవ్వనున్నారు. రెండు పేపర్లోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణత సాధించినట్లు పరిగణిస్తారు.

మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో.. 10వ తరగతి పరీక్షల్లో తీసుకువస్తున్న మార్పులను ప్రకటించారు. రెండు రోజులు నిర్వహించే సామాన్యశాస్త్రం పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఇస్తారు. మిగతా అయిదు సబ్జెక్టులు వంద మార్కులకు ఒక్కొక్క పేపరే ఉంటుంది. కేవలం సైన్స్‌ పేపర్‌లో మాత్రమే మార్పులు చేశౠరు.

ఇతర మార్పులు..

ఏపీ పదోతరగతి పరీక్షలకు సంబంధించి పలు మార్పుల చేసింది. వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. ఇప్పటి వరకు ఉన్న కాంపొజిట్‌ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్‌, ఉర్దూ/ పార్శీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక నుంచి మొదటి భాష ఒక్కటే 100 మార్కులకు ఉంటుంది.

తెలుగు ప్రశ్నపత్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నను తొలగించారు. దీని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై ప్రశ్నలిచ్చే విధానాన్ని తీసుకురానున్నారు. పద్యంపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కోదానికి రెండు చొప్పున 8 మార్కులు కేటాయించనున్నారు. రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండగా.. ఈ ఏడాది నుంచి గద్యాన్ని చదివి, నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక్కో ప్రశ్నకు రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.