iDreamPost
android-app
ios-app

రాష్ట్ర సచివాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు!

రాష్ట్ర సచివాలయంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు!

చేనేత దినోత్సవ వేడుకలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర చేనేత, జౌళీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే సునీత హాజరయ్యారు. హుందాతనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని కల్పించే చేనేత వస్త్రాలను ఉద్యోగులు అంతా విరివిగా ధరిస్తూ.. చేనేత కార్మికులను పెద్దఎత్తున ప్రోత్సహించాలని కే సునీత పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు 50 శాతం రిబేటుపై చేనేత వస్త్రాలను విక్రయించనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర సచివాలయంలో చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులకు కీలక సూచన చేశారు. ఉద్యోగులు విరివిగా చేనేత వస్త్రాలు ధరించి నేతన్నలను ప్రోత్సహించాలన్నారు. అంతేకాకుండా వారికోసం ఈనెలాఖరు వరకు సచివాలయంలోని ఆప్కో విక్రయశాల ద్వారా 50 రిబేటుపై చేనేత వస్త్రాలు విక్రయించనున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే సునీత ప్రకటించారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు ఏపీలోనే కాకుండా.. పలు రాష్ట్రాల్లో 90 విక్రయ శాలలను ఏర్పాటు చేసినట్లు కే సునీత వెల్లడించారు. వినియోగదారులను ఆకర్షించే విధంగా నూతన డిజైన్లతో పలు వస్త్రాలను విక్రయ శాలల ద్వారా అమ్ముతున్నట్లు తెలిపారు.

చేనేత వస్త్రాలను కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులు కోసం ఇంకో సదుపాయం కూడా అందుబాటులో ఉంది. వాళ్లు కొనుగోలు చేసిన మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 నుండి 5 వాయిదాల్లో చెల్లించేందుకు వీలు కల్పించినట్లు సునీత తెలియజేశారు. ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. చేనేత కార్మికులను పెద్దఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కే సునీత విజ్ఞప్తి చేశారు. సునీత చొరవతోనే సచివాలయం ఆవరణలో ఆప్కో విక్రయశాలను ఏర్పాటు చేయడం జరిగిందంటూ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే వెంకట రామిరెడ్డి తెలిపారు. చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించాలని.. చేనేత వస్త్రాలు ధరించిన మహిళా, పురుష ఉద్యోగులను లాటరీ ద్వారా ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేశారు.