Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను ఆదుకోవడం కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. మరీ ముఖ్యంగా వికలాంగులు.. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న మెరుగైన వైద్యం పొందేలా వారికి ఆర్థికసాయం అందజేస్తోన్న సంగతి తెలిసిందే. వారికి ఆసరా పించన్ కింద ప్రతి నెల రూ.10 వేల రూపాయల ఆర్థికసాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో 10 వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వ్యాధిగ్రస్తులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కింద రూ.10 వేలు పొందుతున్న వ్యాధిగ్రస్థులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఉచిత బస్‌పాస్‌లు అందించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. మంగళగిరిలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విడదల రజినీ మాట్లాడుతూ.. క్యాన్సర్, కిడ్నీ లాంటి ప్రాణాపాయ రోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గారు పూర్తిస్థాయిలో అండగా నిలబడతారని తెలిపారు.
సికెల్‌సెల్ ఎనీమియా, థలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ ఉచిత బస్ పాస్‌ల వల్ల ప్రయోజనం ఉంటుందన్నారు మంత్రి విడదల రజనీ. అలానే మహిళలకు ‘ఐబ్రెస్ట్’ అనే పరికరం ద్వారా రొమ్ము క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ప్రయోగాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోని క్యాన్సర్ ఆసుపత్రుల్లో 5 శాతం పడకలను పాలియేటివ్ కేర్ బాధితులకు చికిత్స అందించేందుకు కేటాయించాలన్నారు. విశాఖలోని హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడిచే క్యాన్సర్ గ్రిడ్‌కు.. క్యాన్సర్ చికిత్సనందించే ఆసుపత్రులు అనుసంధానమయ్యేలా చూడాలని ఆదేశించారు విడదల రజినీ.