తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోమారు పొలిటికల్ సెటైర్లు వేశారు. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా సాధించిందేమీ లేదన్నారు. ఆయన్ను నమ్మే పరిస్థితిలో ప్రజలే లేరన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను సృష్టించింది చంద్రబాబేనని కారుమూరి విమర్శించారు. గత సర్కారులో పందికొక్కుల్లా ఇసుకను తిన్నది టీడీపీ నేతలేనని ఆరోపించారు. చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరని కారుమూరి చెప్పుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పర్యటన సందర్భంగా ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
ఆధార్ కార్డు లింక్ అనంతరం దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని మంత్రి కారుమూరి పేర్కొన్నారు. దివంగత నేత నందమూరి తారక రామారావు పేరుపై చెల్లని నాణాన్ని విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎందుకు పిలవలేదని కారుమూరి ప్రశ్నించారు. సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన కుటుంబ సభ్యులు మళ్లీ కలసినట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తలను కేసులు పెట్టించుకోమని చెప్పడం లోకేష్ తెలివికి నిదర్శనమని మంత్రి కారుమూరి సెటైర్స్ వేశారు.
దేశంలోనే జీడీపీలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్లో ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. పౌరసరఫరాల శాఖలో అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పారు. పెట్రోల్ బంకుల్లో ఎలాంటి కల్తీలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కల్తీ చేస్తున్న పలు పెట్రోల్ బంకులను సీజ్ చేశామన్నారు. కొన్ని బంగారు షాపుల్లో కూడా తనిఖీలు నిర్వహించామని చెప్పుకొచ్చారు. ప్రైవేటు ఆస్పత్రుల మీద దాడులు చేసి 131 కేసులు నమోదు చేశామని కారుమూరి తెలిపారు. వంట నూనెల్లో కల్తీ, లోటుపాట్లు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు.