ఆంధప్రదేశ్ మంత్రి దాడిశెట్టి రాజా గురించి తెలిసిందే. రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమంగా మంత్రి స్థాయికి ఆయన చేరుకున్నారు. మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కాకినాడ జిల్లా, తుని నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారాయన. ఏపీ కేబినెట్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు దాడిశెట్టి రాజా. 2009లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్‌లో తుని నియోజకవర్గం టికెట్‌ను ఆశించినా ఆయనకు దక్కలేదు. అనంతరం 2011లో వైఎస్సార్సీపీలో చేరారు దాడిశెట్టి. ఆ పార్టీ తరఫున నిలబడి రెండుస్లార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
దాడిశెట్టి రాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి సత్యానారాయణమ్మ (66) అనారోగ్యంతో కన్నుమూశారు. అమ్మ మరణవార్త గురించి తెలియగానే తాడేపల్లిలో ఉన్న మంత్రి దాడిశెట్టి రాజా వెంటనే తునికి బయల్దేరి వెళ్లారు. రాజా తల్లి సత్యనారాయణమ్మ గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఉన్నట్టుండి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు చెబుతున్నారు. సత్యనారాయణమ్మ మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. ఆమె మృతితో దాడిశెట్టి రాజా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. మంత్రి తల్లి మృతికి సంతాపంగా శనివారం తునిలో మార్కెట్ బంద్ పాటిస్తున్నారు.